Pink Book: పింక్‌ బుక్‌ని రెడీ చేసుకుంటున్న బీఆర్ఎస్? గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నారు..

గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంతకు ముందు లగచర్లలో భూసేకరణ వివాదం.. (Pink Book)

Pink Book: పింక్‌ బుక్‌ని రెడీ చేసుకుంటున్న బీఆర్ఎస్? గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నారు..

Updated On : August 14, 2025 / 10:57 PM IST

Pink Book: 14 ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం..ఎవరి మీద కక్ష సాధింపు లేదు. ఇబ్బంది పెట్టిన అధికారులను టార్గెట్‌ చేసిన దాఖలాలు అసలే లేవు. అంతా ప్రాసెస్‌లో భాగమని చూసీ చూడనట్లు వదిలేశామ్‌. కానీ ఈసారి కథ వేరేగా ఉంటుందంటోంది బీఆర్ఎస్. పింక్‌ బుక్ రెడీ చేస్తున్నామంటోంది. అతి చేస్తున్న అధికారులు..రెచ్చిపోతున్న కాంగ్రెస్‌ నేతల పేర్లన్నీ రాసిపెట్టి.. లెక్కలు సరిచేస్తామంటోంది. పవర్‌లోకి వచ్చాక హిసాబ్..కితాబ్‌ సెటిల్‌ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్. గులాబీ పార్టీ పింక్‌ బుక్ స్ట్రాటజీ ఏంటి? పింక్‌ బుక్‌లో ఇప్పటివరకు నమోదైన పేర్లేంటి.?

తెలుగు స్టేట్స్ పాలిటిక్స్‌లో ఓ లైన్ ట్రెండింగ్‌లో ఉంటోంది. మేము వస్తాం..అందరి లెక్కలు సరిచేస్తామంటూ..అధికారంలో ఉన్న నేతలకు..వారికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులకు వార్నింగ్స్‌ ఇస్తున్నాయి పొలిటికల్‌ పార్టీలు. ఏపీలో జగన్‌..తెలంగాణలో కేటీఆర్‌ పవర్‌లో ఉన్న పార్టీల టార్గెట్‌గా స్ట్రాంగ్‌ వాయిస్ వినిపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వార్నింగ్స్‌ ఇచ్చి తెలంగాణలో రేవంత్‌..ఏపీలో లోకేశ్‌ అధికారంలోకి వచ్చారు. ఆ లెక్కలు సరిచేసే పనిలో కూడా వారు పడిపోయారు.

హిసాబ్‌, కితాబ్‌ సెటిల్‌ చేసే బాధ్యత నాదే..!

ఇక ఇప్పుడు తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ కూడా ఇదే తీరులో వార్నింగ్‌లు ఇవ్వడం ఇంట్రస్టింగ్‌గా మారింది. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను టార్గెట్‌ చేసిన దాఖలాలు లేకపోయినా…ఇప్పుడు మాత్రం ఎవరినీ వదిలేది లేదంటున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. హిసాబ్‌, కితాబ్‌ సెటిల్‌ చేసే బాధ్యత తనదంటూ క్యాడర్‌కు ఓ రేంజ్‌లో భరోసా ఇస్తున్నారాయన.

ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పింక్‌ బుక్‌ని రెడీ చేసుకుంటోందా? తమను, తమ పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాసుకుంటోందా.? అన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్‌ మాటలు బట్టి చూస్తే అదే అర్థమవుతోంది. పలువురు ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఇప్పటి వరకు అధికార, ప్రతిపక్షాల నేతలే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోగా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్స్‌ కూడా టార్గెట్‌ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సివిల్ సప్లయ్స్‌ కార్పొరేషన్ కమిషనర్‌, ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహన్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన మాట్లాడిన తీరుపై బీఆర్ఎస్‌ మండిపడుతోంది.

రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదు..!

గత ప్రభుత్వాలు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వమే రేషన్ కార్డులు ఇస్తుందనేలా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ అవుతున్నాయి. అటు బీఆర్‌ఎస్‌ కూడా దీని మీద రియాక్ట్‌ అయింది. సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌, హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటలను తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్.

తమ హయాంలో రేషన్‌ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు అధికారులు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడటం తగదన్న కేటీఆర్‌..ఇదే క్రమంలో తాము తిరిగి అధికారంలోకి వస్తాం..అప్పుడు అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు కూడా. పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆదేశాలు పాటిస్తూ..బీఆర్‌ఎస్‌ శ్రేణులపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అలాంటి అధికారుల సంగతి చూస్తామని వార్నింగ్..

గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అంతకు ముందు లగచర్లలో భూసేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడుతూ వస్తున్న కేటీఆర్..అలాంటి అధికారుల సంగతి తర్వాత చూస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు.

అయితే బీఆర్ఎస్‌ ఈసారి ఇంతా సీరియస్‌గా రియాక్ట్ కావడానికి కారణం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ నేతల చెప్పుచేతల్లో అడ్డగోలుగా బిహేవ్‌ చేయడంపై మండిపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ 14ఏళ్ల పాటు ఉద్యమం చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు కేటీఆర్, హరీశ్‌రావు డీసీపీలు, పోలీస్ హైయ్యర్ అఫీషియల్స్‌తో వాగ్వాదానికి దిగిన సందర్భాలున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని అణదొక్కే ప్రయత్నం చేశారని అప్పుడు పలువురు పోలీస్ అధికారులపై బీఆర్ఎస్‌ తీవ్రస్థాయి ఆరోపణలు చేసేది.

కానీ 2014లో పవర్‌లోకి వచ్చాక..ఎవరి మీద కక్ష సాధింపులకు దిగలేదు. ఆ మాటకొస్తే పలువురి అధికారులకు మంచి పోస్టింగులు ఇచ్చింది కూడా. అలిగేషన్స్ ఉన్న ఆఫీసర్స్‌తో పాటు..ఏ కాంగ్రెస్ నేత మీద కూడా పనిగట్టుకొని తాము రివేంజ్‌ పాలిటిక్స్ చేయలేదని బీఆర్ఎస్సే చెప్పుకుంటోంది. కానీ ఈసారి మాత్రం జుకేగా నహీ అంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ నేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టడమేనట.

సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా మిడ్‌నైట్ అరెస్టు చేస్తున్నారని..కొందరు అధికారులు అయితే అత్యుత్సాహం చూపిస్తున్నారని ఫైర్ అవుతున్నారు గులాబీ లీడర్లు. మల్కాజ్‌గిరిలో కార్పొరేటర్ భర్త మీద దాడి, కరీంనగర్, ఖమ్మంలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు, పలువురు అధికారులు చేసిన కామెంట్స్ అన్నీ బీఆర్ఎస్‌ పెద్దల దృష్టిలో ఉన్నాయట. ఈ క్రమంలోనే ఈసారి పింక్‌ బుక్ రెడీ చేస్తున్నారని అంటున్నారు.

క్యాడర్‌కు భరోసా కల్పించేందుకు..కేటీఆర్ ఓపెన్ స్టేట్‌మెంట్లే ఇస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో పలువురు అధికారుల్లో గుబులు మొదలైందట. అయితే ఏపీలో టీడీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు లోకేశ్‌ రెడ్‌బుక్‌ అంటూ హడావుడి చేశారు. పవర్‌లోకి వచ్చాక ఆ రెడ్‌ బుక్‌ పేరుతో పలువురు వైసీపీ నేతల మీద యాక్షన్‌ తీసుకుంటున్నారు. కొందరు అధికారులను అయితే పక్కన పెట్టారు.

ఇప్పుడు కేటీఆర్ పింక్‌ బుక్‌ కూడా అంతకు మించి ఉండబోతుందని అంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. పింక్‌ బుక్‌లో నమోదవుతున్న పేర్లు ఎవరివో..బీఆర్ఎస్‌ పవర్‌లోకి వచ్చాక వారిపై ఎలాంటి రివేంజ్‌ ఉండబోతుందో చూడాలి మరి. ఈ బుక్‌ల గోల ఎలా ఉన్నా అధికార పార్టీలకు కొందరు అధికారులు తొత్తులుగా మారడం మాత్రం ప్రజల్లో అధికార యంత్రాంగాన్నే పలచన చేస్తుందన్నది మాత్రం అక్షర సత్యం.

Also Read: కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది.. పీసీసీ చీఫ్ పాదయాత్ర వెనుక పెద్ద ప్లానే ఉందా?