Telangana Congress: కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది.. పీసీసీ చీఫ్ పాదయాత్ర వెనుక పెద్ద ప్లానే ఉందా?

ఇప్పుడు అధికార కాంగ్రెస్ ముఖ్యనేతలే పాదయాత్ర చేయడం ఏంటనేది సీఎం రేవంత్ రెడ్డి వాదన అంటున్నారు. (Telangana Congress)

Telangana Congress: కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది.. పీసీసీ చీఫ్ పాదయాత్ర వెనుక పెద్ద ప్లానే ఉందా?

Updated On : August 13, 2025 / 11:29 PM IST

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? ఎవరు పాదయాత్ర చేస్తున్నారు? ఎవరు చేస్తున్న పాదయాత్రలో ఎవరు పాల్గొంటున్నారు? అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు? ప్రజలకే కాదు కాంగ్రెస్‌ నేతలకు కూడా అంతుచిక్కడం లేదట. పీసీసీ చీఫ్‌తో ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ చేస్తున్న పాదయాత్రపై ఇప్పటికే హాట్‌ టాపిక్ అవుతోంది.

ఇక రెండో విడత యాత్ర షెడ్యూల్‌ ప్రకటించారు పీసీసీ చీఫ్. ఎవరి ఎజెండాతో వారు పనిచేస్తున్నారా? సీఎం, పీసీసీ చీఫ్‌ మధ్య గ్యాప్ వచ్చిందా? మహేష్‌ కుమార్‌ గౌడ్ బీసీ సీఎం నినాదం ఎత్తుకోవడం వెనుక మాస్టర్ ప్లానేంటి?

తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల ఎపిసోడ్‌ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌తో పాటు ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చేస్తున్న పాదయాత్రపై ఇప్పటికే ఇంటా బయట హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఈ పాదయాత్ర చుట్టూనే రాజకీయం రంజుగా నడుస్తోంది. దొరికిందే ఛాన్స్ అనుకొని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హడావిడి చేస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గుర్రుగా ఉన్నారట. (Telangana Congress)

అసలు పాదయాత్ర ఎందుకు?

పీసీసీ చీఫ్‌ ఇప్పుడు రెండో విడత పాదయాత్ర షెడ్యూల్‌ను కూడా ప్రకటించడంతో పార్టీకి, ప్రభుత్వానికి దూరం పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. పీసీసీ చీఫ్, ఇంచార్జ్ మీనాక్షి పాదయాత్రపైనే ఆసక్తి. అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు..? ఆల్ ఆఫ్ సడెన్‌గా ఎందుకు పాదయాత్ర చేపట్టాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

అయితే పార్టీ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల కోసం ఎంపిక చేసిన జాబితాలను చూసిన తర్వాత గ్రౌండ్‌లో పరిస్థితి ఏంటనేది తెలుసుకోవాలని భావించారని చెబుతున్నారు. అందుకోసం కచ్చితంగా ఫీల్డ్‌లోకి వెళ్తే పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేయవచ్చని భావించారట.

దీంతో పాదయాత్ర చేయాలని నిర్ణయించి..ఒక్కరోజులోనే షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ సీఎం రేవంత్ రెడ్డితో డిస్కస్ చేయకుండానే జరిగిపోయాయట. ఇప్పుడిదే కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది

పీసీసీ చీఫ్, ఇంచార్జ్‌ మీనాక్షి పాదయాత్ర సీఎం రేవంత్‌కు ఏ మాత్రం ఇష్టం లేదట. గతంలో ఎవరు పాదయాత్ర చేసినా ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష నేతలు జనంలోకి వెళ్లిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ ముఖ్యనేతలే పాదయాత్ర చేయడం ఏంటనేది సీఎం వాదన అంటున్నారు. అందుకే పాదయాత్రను మొదటి నుంచి ఇంటర్నల్‌గా విభేదిస్తూ వచ్చారట.

ఇంచార్జ్ మీనాక్షి పూర్తిగా అధిష్టానం దగ్గరి మనిషి కావడంతో సీఎం కూడా ఏమీ చేయలేకపోయారట. అందుకే మొదటి విడత పాదయాత్రను మధ్యలోనే నిలిపేసేలా ఢిల్లీ ప్రోగ్రామ్‌ను పెట్టారనే టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆగస్ట్‌ 24 నుంచి రెండో విడత పాదయాత్రకు రెడీ అవుతున్నారు.

Also Read: పొలిటికల్ గేమ్ స్టార్ట్.. లోకల్‌ బాడీ ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకునేందుకు పార్టీల స్కెచ్..

పాదయాత్ర విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా దొరికిందే ఛాన్స్ అనుకొని హడావిడి చేస్తున్నారట. వాస్తవానికి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ఆయన జిల్లాల పర్యటన చేయాలని అనుకుంటున్నా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఇంచార్జ్ రూపంలో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకొని.. పాదయాత్ర తనదే అని చెప్పుకుంటున్నారట. పాదయాత్రలో కూడా అంతా తానే ముందుండి ప్రోగ్రామ్‌ను గ్రాండ్ సక్సెస్ అయ్యేలా చూస్తున్నారట.

నెక్ట్స్ బీసీ సీఎం అవుతారని స్టేట్ మెంట్..

మరోవైపు పాదయాత్ర చేసిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక విధంగా పబ్లిక్‌లో ఎస్టాబ్లిష్ అయి..ఆ తర్వాత పొలిటికల్‌గా మరింత స్ట్రాంగ్ అయ్యారు. ఈ పాదయాత్ర ద్వారా తాను కూడా కాంగ్రెస్‌లో తానే ఆల్టర్నేట్ లీడర్‌నని ప్రొజెక్ట్‌ చేసుకోవాలని మహేష్‌కుమార్‌ గౌడ్‌ ప్లాన్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు ఛాన్స్ దొరికిన ప్రతీసారి కాంగ్రెస్‌లో నెక్ట్స్ బీసీ సీఎం అవుతారని స్టేట్మెంట్ ఇస్తున్నారు. (Telangana Congress)

సీఎం రేవంత్ విషయంలో అధిష్టానం రెండో ఆలోచన చేస్తే..ప్రత్యామ్నాయం తానేనని మహేష్ కుమార్‌ గౌడ్ చెప్పుకునేందుకే యాత్రకు చేస్తున్నారా అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పాదయాత్ర విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్‌కు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇలా ఒక్క పాదయాత్ర కాంగ్రెస్‌లో రకరకాల చర్చకు దారి తీస్తోంది. పాదయాత్ర ద్వారా బీసీ సీఎం రేసులో ఉండాలనేది మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ప్రయత్నమా? లేక పార్టీ గ్రాఫ్‌ పెంచేందుకే పాదయాత్ర చేస్తున్నారా? చూడాలి. (Telangana Congress)