Local Body Elections: పొలిటికల్ గేమ్ స్టార్ట్.. లోకల్‌ బాడీ ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకునేందుకు పార్టీల స్కెచ్..

కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము ఒక శాతం ఎక్కువే టికెట్లు ఇచ్చామని.. (Local Body Elections)

Local Body Elections: పొలిటికల్ గేమ్ స్టార్ట్.. లోకల్‌ బాడీ ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకునేందుకు పార్టీల స్కెచ్..

Updated On : August 13, 2025 / 9:35 PM IST

Local Body Elections: బీసీ కోటా లొల్లి క్లైమాక్స్‌కు చేరింది. 42శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత ఇప్పట్లో సాధ్యం కాదని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇక అసలు గేమ్ స్టార్ట్‌ చేశాయి పార్టీలన్నీ. లోకల్‌ బాడీ ఎన్నికల్లో బీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు స్కెచ్ వేస్తున్నాయి. పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామని కాంగ్రెస్..అంతకంటే ఒకటి ఎక్కువగా 43శాతం సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ అంటోంది. తామేం తక్కువ కాదంటూ..బీసీలకు 50శాతం టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతోందట బీజేపీ. స్థానిక సంస్థల్లో బీసీల మద్దతు ఎవరివైపు? టికెట్ల కేటాయింపుతో క్రెడిట్ రేసులో ఎవరు ముందుండనున్నారు?

బీసీ నినాదంతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. రెండు మూడు నెలలుగా తెలంగాణ రాజకీయం మొత్తం బీసీల చుట్టే తిరుగుతోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోవడంతో రాజకీయ పార్టీలు పొలిటికల్ గేమ్ స్టార్ చేశాయి. లోకల్ బాడీ ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అసెంబ్లీలో బిల్లును పాస్‌ చేసి రాష్ట్రపతికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్‌కు పంపించింది రేవంత్ సర్కార్.

ఇక చేసేదేమీ లేక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ..

గవర్నర్ కూడా ఎటూ తేల్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసి..ఇక చేసేదేమీ లేక స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది స్టేట్‌ గవర్నమెంట్‌. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కావడం లేదు కాబట్టి పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లు ఇవ్వాలని హస్తం పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తమలాగే అన్ని పార్టీలు బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్ నేతలు. (Local Body Elections)

బీసీ రిజర్వేషన్ల విషయంలో అధికార కాంగ్రెస్ వైఖరిని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది. పార్లమెంట్‌లో చట్టం చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి హామీ ఇచ్చి..తూతూ మంత్రంగా ప్రయత్నించి.. ఇప్పుడు చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్.

అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ పోల్స్‌కు రెడీ అవుతుండటంతో గులాబీ పార్టీ అలర్ట్ అయ్యింది. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టడంతో పాటు బీసీ వర్గాలను తమవైపు తిప్పుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్నదానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించొచ్చని అంచనా..

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే ఒక శాతం ఎక్కువే బీసీలకు టికెట్లు ఇవ్వాలని గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ బీసీలకు 42 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాము బీసీలకు 43 శాతం టికెట్లు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారట.

Also Read: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అలీఖాన్ నియామకం రద్దు.. కారణం అదేనా..

కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ కంటే తాము ఒక శాతం ఎక్కువే టికెట్లు ఇచ్చామని చెప్పుకోవాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల్లో పార్టీ పట్ల సానుకూలత ఏర్పడటంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించొచ్చని బీఆర్ఎస్ అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల కోసం తమ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలను మించి ప్లాన్ చేస్తోందట కమలం పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం టిక్కెట్లు ఇవ్వానుండటం, బీఆర్ఎస్ 43 శాతం స్థానాలను కేటాయించే అవకాశం ఉండటంతో అంతకంటే ఎక్కువ చేయాలని భావిస్తున్నారట బీజేపీ నేతలు.

లోకల్ బాడీ పోల్స్‌లో పార్టీ పరంగా బీసీలకు ఏకంగా 50 శాతం టికెట్లు ఇచ్చి ఆ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలనకుంటోందట కమలం పార్టీ. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.(Local Body Elections)