తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడ గ్రామస్తులు అలిగారు. తమకు డబ్బులు పంచలేదని వారు కోపంగా ఉన్నారు. అంతేకాదు.. ఓటు వేయడానికి గ్రామస్తులు నిరాకరించారు. మాకు డబ్బులు పంచనప్పుడు.. మేము ఓటు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తామని వారు తెగేసి చెబుతున్నారు. డబ్బులు పంచలేదని చింతగూడ గ్రామస్తులు నిరసనకు దిగడం, డబ్బు పంచిన వారికే ఓటు వేస్తున్నట్టు ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల తీరుతో అంతా అవాక్కవుతున్నారు. ఇదెక్కడి గోలరా బాబూ అని నాయకులు, ఎన్నికల అధికారులు తలలు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్తానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం (మే 6,2019) తొలి విడత పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముందు రోజు ఆదివారం (మే 5,2019) రాత్రి చింతగూడ గ్రామంలో డబ్బుల పంపిణీ జరిగింది. ఓ పార్టీకి చెందిన నేతలు ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని తెలుస్తోంది. దీంతో డబ్బులు అందని మరో వర్గం ప్రజలు నిరసనకు దిగారు. వారంతా ఓటు వేయడానికి నిరాకరించారు. మాకు డబ్బు ఇవ్వలేదు కాబట్టి మేము ఓటు వేసేది లేదని తెగేసి చెబుతున్నారు. డబ్బు ముట్టిన వాళ్లే ఓట్లు వేస్తున్నారని చెబుతున్నారు. తమకు డబ్బు ఇవ్వకపోవడాన్ని మహిళలు అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయమై కొందరు మహిళలు లోకల్ లీడర్లతో ఘర్షణకు దిగారు. మేము ఓటర్లం కాదా, మాకు ఓట్లు లేవా అని అడుగుతున్నారు. మాకు డబ్బు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది, ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ఓటరు డబ్బుకి అమ్ముడుపోకూడదని ఎన్నికల అధికారులు చెబుతుంటే.. ఈ గ్రామస్తులు ఏమో.. ఇలా అంటున్నారు. నాయకులు ఇచ్చే వందలు, వేల రూపాయలకు కక్కుర్తి పడి విలువైన ఓటుని అమ్ముకోవద్దని అధికారులు చెబుతున్నా, చైతన్యం నింపుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.