కరీంనగర్: ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా తెలంగాణ సీఎ కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు గులాబీ బాస్. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర్ లో మార్చి 17న బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 19న నిజామాబాద్ లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. 17 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 16 నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో సభలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సభలోనూ కేసీఆర్ ప్రసంగించనున్నారు. ప్రతి సభకు భారీగా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే
కరీంనగర్‌లో కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. భారీగా జన సమీకరణ పనిలో ఉన్నారు. రెండున్నర లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో 7 నియోజకవర్గాలు కరీంనగర్, మానకొండూరు, హుజురాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల నుంచి జనాలను తరలించనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల నుంచి 40 వేల మందిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ సభకు ఆహ్వానించాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు సభకు వచ్చేలా చూడాలన్నారు. సభకు వచ్చే వారి కోసం తాగునీరు ఏర్పాట్టు చేస్తున్నారు. ఎండ నుంచి ఇబ్బంది కలగకుండా చలవ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. మార్చి 17న స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్ లో సాయంత్రం 5.30కి సభ జరగనుంది.
సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు వినోద్ కుమార్, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య తదితరులు పిలుపునిచ్చారు. 2018లో కరీంనగర్ నుంచి రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ‘సింహ గర్జన’ పేరుతో నిర్వహించిన తొలి బహిరంగ సభ కూడా 2001లో కరీంనగర్ లోనే జరిపారు. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి కేసీఆర్ వరుసగా 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2004లో గెలుపొందిన తర్వాత 2006, 2008 లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలుపొందారు.