ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పాలసీతో 50 మందిని చంపేశారని ఆరోపించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓటును రూ.2 వేలకు కొనే ఎమ్మెల్యేలు చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. శుక్రవారం (నవంబర్ 15, 2019) మంగళగిరిలో జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి కోల్పోయిన కార్మికులకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలన్నారు. కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రజలను చంపేస్తుంటే మేం మౌనంగా ఉండిపోవాలా… వైసీపీకి 151 సీట్లు ఇచ్చినందుకు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు పవన్. కొత్త పాలసీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకు డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు జనసేన అధినేత.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించలేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రతిపక్షనేత చంద్రబాబుపై కోపంతో నిర్మాణాలు ఆపేశారని మండిపడ్డారు. రాజధానికి అన్ని భూములు అవసరం లేదనుకుంటే.. 30 వేల ఎకరాల్లో కాకుండా 5 వేల ఎకరాల్లో రాజధాని కట్టొచ్చన్నారు. రాజధానిపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నారు.
ఇక జగన్ రాజధాని పులివెందులలో పెట్టాలనుకుంటే.. ప్రజామోదంతో అదైనా చేయొచ్చన్నారు జనసేనాని. తాము కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూ చురకలంటించారు పవన్. తాను మాట్లాడితే శాపనార్దాలు పెడతానని అంటున్నారని.. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించనని.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 మంది కార్మికులు చనిపోతే మాట్లాడకుండా ఉండాలా అంటూ ప్రశ్నించారు.