నడ్డాతో పవన్ రహస్య మంతనాలు : హాట్‌ టాపిక్‌గా జనసేనాని వ్యవహారం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు.

  • Publish Date - December 5, 2019 / 11:00 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను రోజు రోజుకూ వేడెక్కిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, మత కామెంట్లతో కొత్త కొత్త కాంట్రవర్సీలకు తెరలేపుతున్నారు. హిందుత్వవాదాన్ని తాజాగా భుజానికెత్తున్న పవన్ కల్యాణ్.. వైసీపీ టార్గెట్‌గా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా సీఎం  జగన్మోహన్‌రెడ్డే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ మతాన్ని కాదని క్రైస్తవాన్ని తీసుకున్నప్పుడు.. పేరు చివర్లో కులం ఎందుకంటూ పవన్ కల్యాణ్ వివాదానికి ఆజ్యం పోశారు. అంతటితో ఆగకుండా హిందుత్వాన్ని పదేపదే వల్లెవేస్తూ.. వైసీపీ నేతలపై కాలుదువ్వుతున్నారు. అంది వచ్చిన ప్రతీ అంశంలోనూ అయితే కులం, లేకుంటే మతం పేరు ప్రస్తావిస్తున్నారు. 

నిన్నటి కడప జిల్లా  పర్యటన మొదలుకొని నేటి చిత్తూరు జిల్లా మదనపల్లె వరకు టోటల్‌ ఎపిసోడ్ అంతా కులం, మతం చుట్టూనే తిప్పారు పవన్‌ కల్యాణ్. దీనికి సీఎం జగన్ మొదలు కొని.. మంత్రుల వరకు అందరూ వరుసగా పవన్  కల్యాణ్‌కు కౌంటర్లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో కుల, మత రాజకీయం రంజుగా మారింది. అసలు పవన్ కల్యాణ్‌ సడన్‌గా హిందుత్వాన్ని ఎందుకు ఎత్తుకున్నారు..? కులాలకు, మతాలకు అతీతుడనని చెప్పిన ఆయన.. సడన్‌గా రూటెందుకు మార్చారు..? ఇది పవన్ సొంత నిర్ణయమా.. లేక.. పవన్‌ను ఎవరైనా నడిపిస్తున్నారా..? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌.. 

రాయల‌సీమ‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు వింటుంటే…బీజేపీ వైపు శ‌ర‌వేగంగా అడుగులు వేస్తున్నాడ‌ని తెలిసిపోతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీలో ప‌ర్యటించ‌డం, ప‌ర్యట‌న వివ‌రాల‌ను గోప్యంగా ఉంచ‌డాన్ని చూస్తుంటే బీజేపీ పెద్దల‌తో ర‌హ‌స్య ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ ప‌ర్యట‌న తరువాత పవన్ వ్యవహార శైలి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోందంటున్నారు. ఇప్పుడాయ‌న పేరుకు జన‌సేనానే కానీ, మాట బీజేపీ భావ‌జాలం నుంచి పుట్టుకొచ్చిందేనన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఇందుకు కారణాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. 

పవన్ ఢిల్లీ  పర్యటనకు ముందు జనసేన నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయనే ప్రచారం జరిగింది. జనసేన ఖాళీ అవ్వడం ఖాయమన్న వార్తలొచ్చాయి. దీంతో పవన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు జనసేనను మింగేయక ముందే.. జాగ్రత్తపడ్డారట. పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఆద్యంతం గోప్యంగా సాగింది. ఈ క్రమంలోనే బీజేపి అధిష్టానంతో రహస్య ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది. నోయిడాలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ నాలుగు గంటలకు పైగా రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.

ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీకి ప్రత్యేకమైన క్యాస్ట్ ఓటు  బ్యాంకు ఉంది. కానీ ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీకి మాత్రం ఏ విధమైన క్యాస్ట్ ఓట్ బ్యాంక్ లేదు. పైగా ప్రస్తుతం ఉన్న కేడర్‌తో రాష్ట్రంలో  బీజేపీని అధికారంలోకి రావడం కష్టం. దీంతో బీజేపీ అధిష్టానం పవన్ కల్యాణ్‌ను లైన్‌లో పెట్టినట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌కు ఉన్న కాపుల ఓటు బ్యాంకుకు, హిందుత్వం తోడైతే కచ్చితంగా బలపడతామన్న వాదన బీజేపీ అధిష్టానం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ హిందుత్వ వాదన భుజానికెత్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అందులో భాగంగానే పవన్ కల్యాణ్ నోటి వెంట  కొద్ది రోజులుగా కులం, మతం డైలాగులు వినిపిస్తున్నాయంటున్నారు. ఈక్రమంలో జనసేన బీజేపీలో కలవడం ఖాయమన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బీజేపీతో జనసేన పొత్తుపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.