Bidhuri Remarks on Dnish Ali: లోక్‌సభలో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అవమానకర వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై ఇప్పటికే బధూరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక ఆయనకు విపక్షాలు సైతం పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ సైతం తన మద్దతును ప్రకటించారు. డానిష్ అలీని కౌగిళించుకున్న ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. ‘‘విధ్వేషం నిండిన బజారులో ప్రేమ దుకాణం’’ అని భారత్ జోడో యాత్రం కొటేషన్ రాసుకొచ్చారు.
ఈ రచ్చ అనంతరం, డానిష్ అలీ ఇంటికి వెళ్లిన రాహుల్ ఆయనను కలిసి మాట్లాడారు. అనంతరం ఆయనతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాంగ్రెస్ స్పందిస్తూ.. “నిన్న పార్లమెంటులో డానిష్ అలీని బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అవమానించారు. ఆయన మీద చాలా అసభ్యకరమైన, అన్‌పార్లమెంటరీ దూషణలు చేశారు. ఇద్దరు బీజేపీ మాజీ మంత్రులు అసభ్యకరంగా నవ్వుతూనే ఉన్నారు. రమేష్ బిధురిది సిగ్గుచేటు, చిల్లర చర్య. అవమానకరంగా ఉంది. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇటువంటి ద్వేషం, ద్వేషపూరిత మనస్తత్వానికి దేశంతో పాటు కాంగ్రెస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది” అని రాసుకొచ్చారు.
नफ़रत के बाज़ार में मोहब्बत की दुकान pic.twitter.com/3IqLMFU0dx
— Rahul Gandhi (@RahulGandhi) September 22, 2023
ఇక, డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అవమానకర వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ రికార్డు నుంచి తొలగించారని, అయితే ఇంత జరిగినా ఆయనపై సదరు పార్టీ తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ఈ ఘటనపై శుక్రవారం ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ రికార్డు నుంచి తొలగించారు. అలాగే ఆయనను హెచ్చరించారు, సభలో క్షమాపణలు కూడా చెప్పారు. ఇంత జరిగినా ఆయనపై సదరు పార్టీ తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం’’ అని ట్వీట్ చేశారు.
ఈ అంశంపై స్వయంగా ఎంపీ డానిష్ అలీ స్పందించారు. అవమానకర వ్యాఖ్యలు చేసిన ఎంపీ బిధూరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తాను సభను వీడతానంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బిధూరిపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని తనకు నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-3 విజయంపై సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు లోక్‌సభలో చర్చ జరుగుతోంది. సౌత్ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి సభలో మాట్లాడడుతున్నారు? ఆ సమయంలో బిధూరి ప్రకటనతో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ విభేదించారు. దీంతో సహనం కోల్పియిన బిధురి అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారు.