Rahul Gandhi: స్పోర్ట్స్ బైకెక్కి 500 మంది యువతతో లధాఖ్ కొండల్లో రైడ్ తీసిన రాహుల్ గాంధీ

ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గురువారం లేహ్ చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించారు. 30 మంది సభ్యులున్న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌హెచ్‌డీసీ)-కార్గిల్‌కు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి

Bike Ride Ladakh: రాజకీయాల్లో నిత్యం తలమునకలయ్యేవారు ఒక్కోసారి కాస్త ట్రెండింగ్ లుక్కులో కనిపించి ఆసక్తి నెలకొల్పుతుంటారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇలాగే కనిపించారు. బ్లేజర్ వేసుకుని స్పోర్ట్స్ బైక్ ఎక్కి లధాఖ్ కొండల్లో రయ్ రయ్ మంటూ కనిపించారు. ఆయన వెంట సుమారు 500 మంది యువత బైకులు రైడ్ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఆగస్టు 20న పాంగోంగ్ సరస్సులో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ వేడుకల నిమిత్తం ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ శుక్రవారం తన మొదటి లడఖ్ పర్యటన సందర్భంగా లేహ్‌లో 500 మందికి పైగా యువకులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.

ఆర్టికల్ 370, 35(ఏ) రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత లధాఖ్‌కు రాహుల్ వెళ్లడం ఇదే తొలిసారి. అంతకుముందు, లధాఖ్‌లో రాహుల్ గాంధీ ఉన్న సమయంలో కార్గిల్ స్మారకానికి వెళ్లారు. స్థానిక యువతతో జరిగిన ఇంటరాక్టివ్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. లేహ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ కూడా చూశారు. కాగా, ఈ విషయమై కాంగ్రెస్ లేహ్ జిల్లా అధికార ప్రతినిధి, అక్కడి ప్రతిపక్ష నాయకుడు సెరింగ్ నమ్‌గ్యాల్ మాట్లాడుతూ ‘‘రాహుల్ గాంధీ శుక్రవారం లేహ్‌లోని కిక్కిరిసిన ఆడిటోరియంలో 500 మందికి పైగా యువకులతో 40 నిమిషాల సుదీర్ఘ ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించారు’’ అని అన్నారు.

కాగా, ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గురువారం లేహ్ చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించారు. 30 మంది సభ్యులున్న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌హెచ్‌డీసీ)-కార్గిల్‌కు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు రాహుల్ అక్కడ పర్యటన ఆసక్తికర పరిణామం. గురువారం లధాఖ్ చేరుకున్న రాహుల్ గాంధీకి లేహ్ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్‌, జమ్మూలో రాహుల్ రెండుసార్లు పర్యటించినప్పటికీ లధాఖ్‌కు రాలేదు.