మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు.. సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గం ప్రజలు.. ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు.. సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గం ప్రజలు.. ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు సమర్థించారు. ఈ మేరకు పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేశాయి. కుప్పం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి తీర్మానాలు వచ్చాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ చదువులు అందుతాయని, తమ పిల్లలు భవిష్యత్తులో బాగుపడతారని తల్లిదండ్రులు చెప్పారని మంత్రి తెలిపారు.
ఇంగ్లీష్ మీడియానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేశాయని మంత్రి తెలిపారు. 43వేల పాఠశాలల నుంచి వచ్చిన తీర్మాన ప్రతులను పేరెంట్స్ కమిటీలు ప్రభుత్వానికి అందజేశాయని.. అందరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారని తెలియజేశారు. దీన్ని చంద్రబాబు గమనించాలని, ఇకనైనా ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం మానుకోవాలని మంత్రి సూచించారు. కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్న వారికి.. ఈ తీర్మానాలు చెంపపెట్టు అని భావిస్తున్నామని మంత్రి సురేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తామన్నారు. అలాగే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. ఇంగ్లిష్ మీడియంతో పేద విద్యార్థులందరికీ మేలు జరుగుతుందని.. ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో ఇంగ్లీష్ భాష ఎంతో ఉపయోగకరం ఉంటుందని మంత్రి అన్నారు.
ఇంగ్లీష్ మీడియం అమలు చేసేందుకు టీచర్లకు ట్రైనింగ్ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియం అమలుకు, అమ్మఒడి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించామన్నారు. ప్రాథమిక స్థాయిలో 1,2,3 తరగతులకు అలాగే 4,5 తరగతుల వారికి బ్రిడ్జ్ కోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పాఠ్యాంశాలను కూడా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసిందన్నారు. విద్యార్థులకు క్లాస్ పుస్తకాలు, వర్క్ పుస్తకాలు వేర్వేరుగా ఇస్తామన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు బ్యాగ్, యూనిఫామ్, బూట్లు ఇస్తామన్నారు. ఒక్కో కిట్ కోసం రూ.1500 ఖర్చు అవుతుందున్నారు.
పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ చదువులు అందుబాటులోకి తేవాలని, వారి భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందుగా 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం.. ఇంగ్లీష్ మీడియంను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వం నిర్ణయంతో మాతృభాషకి అన్యాయం జరుగుతుందని చంద్రబాబు వాపోతున్నారు.