కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

  • Publish Date - May 4, 2019 / 09:29 AM IST

ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కాంగ్రెస్‌ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. శనివారం (మే 4,2019) స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఆమె వెళ్లారు. గోవింద్రాలలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎమ్మెల్యే హరిప్రియని అడ్డుకున్నారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిప్రియ పార్టీ మారడంపై కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేశాయి. రాళ్ల దాడికి పాల్పడ్డారు.

ఎమ్మెల్యేను అడ్డుకున్న వారితో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడి ఘటనపై ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ తీవ్రంగా స్పందించారు. తనపైన, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపైన జరిగిన దాడిని ఖండించారు. దీని వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసు అని చెప్పారు. నెల రోజులుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతున్నానని.. ఎక్కడాలేని ఘటనలు కామేపల్లి మండలంలో ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. 11మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారని ఆమె గుర్తు చేశారు. ఎక్కడా ఇటువంటి సంఘటనలు జరగలేదన్నారు. తనపై దాడి చేసినవారిపై ప్రజలు తిరగబడ్డారని, తన వెనుక ప్రజా బలముందని హరిప్రియ చెప్పారు. తన మీద జరిగిన దాడిని గిరిజన మహిళల మీద జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు.