అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చిస్తున్నారు. రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. శాసన మండలిలో తమకున్న బలాన్ని సద్వినియోగం చేసుకోవడంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల సంఖ్యా బలం ఎక్కువగా ఉంది కాబట్టి రాజధానిపై ప్రభుత్వం ఏ విధంగా వెళ్లినా అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. పలువురు న్యాయ నిపుణులతో ఈ అంశంపై చర్చిస్తున్నారు.
శాసన మండలి సభ్యుల్లో ఎవరైన అధికార పక్షంతో టచ్ లో ఉన్నారా అన్న అంశంపై చర్చించుకుంటున్నారు. 25 శాసన మండలి సభ్యులు టీడీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు.
రేపు ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళ్తుంది? బిల్లును ఏ రూపంలో తీసుకొస్తుంది? ఏపీ రాజధానిని మారుస్తామని చెబుతారా? సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తారా? ప్రభుత్వం ఏ విధంగా చేసే అవకాశం ఉందన్న అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. దానికి విరుగుడుగా ప్రతిపక్షం నుంచి ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నారు.
న్యాయస్థానాలతో అడ్డుకట్టే వేసే అవకాశం ఉందని సమావేశంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏం చేయలేం..కానీ మండలిలో మాత్రం బిల్లును వెనక్కి పంపించాలని యోచిస్తున్నారు. న్యాయస్థానాల ద్వారానే ప్రభుత్వానికి ఇబ్బంది కర పరిస్థితులు సృష్టించవచ్చని, సీఆర్డీఏ చట్టాన్ని సవరించే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అవసరమైతే ఢిల్లీ స్థాయిలో ఒక బృందాన్ని పంపాలని ఆలోచన చేస్తున్నారు. రేపు జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
మరోవైపు శాసన మండలిలో మండలి సభ్యులను ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వం వైపు నుంచి టీడీపీ అధిష్టానానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో శాసన మండలి సభ్యులందరితో కూడా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. శాసన మండలిలో టీడీపీకి 33 మంది సభ్యుల బలం ఉంది. ఈ రోజు సమావేశానికి 23 మంది సమావేశానికి హాజరయ్యారు. అయితే మిగిలిన సభ్యులు ఎందుకు రాలేదని కనుగొనే పనిలో అధిష్టానం ఉంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శాసన మండలి సభ్యులు చెబుతున్నారు. బుద్ధా వెంకన్న మండలి సభ్యులకు విప్ జారీ చేశారు. ఎల్లుండి జరుగనున్న శాసన మండలి సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేశారు.