బాబుకి మరో తలనొప్పి : జగ్గంపేట సీటు కోరిన తోట నర్సింహం

అమరావతి: ఓ వైపు నేతలు వరుస పెట్టి టీడీపీని వీడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో చేరుతున్నారు. ఈ షాక్‌లతో టీడీపీ శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. వలసల పర్వం

  • Publish Date - February 19, 2019 / 09:58 AM IST

అమరావతి: ఓ వైపు నేతలు వరుస పెట్టి టీడీపీని వీడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో చేరుతున్నారు. ఈ షాక్‌లతో టీడీపీ శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. వలసల పర్వం

అమరావతి: ఓ వైపు నేతలు వరుస పెట్టి టీడీపీని వీడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వైసీపీలో చేరుతున్నారు. ఈ షాక్‌లతో టీడీపీ శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. వలసల పర్వం సీఎం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. ఇది చాలదన్నట్టు చంద్రబాబుకి మరో సమస్య వచ్చిపడింది. టికెట్ల పంచాయతీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉంటున్నారు. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు.. కొందరు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు కాకినాడ ఎంపీ తోట నర్సింహం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆయన జగ్గంపేట అసెంబ్లీ టికెట్ అడుగుతున్నారు. తన భార్యకు జగ్గంపేట టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

 

ఎంపీ తోట తన కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం అమరావతిలో చంద్రబాబును కలిసి తన మనసులో మాటను చెప్పారు. అనారోగ్య కారణాలతో తాను ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చంద్రబాబుతో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన భార్య వాణికి ఇవ్వాలని కోరారు. జగ్గంపేట నుంచి తాను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని తోట గుర్తు చేశారు. టికెట్ విషయంపై చంద్రబాబు ఆలోచించి నిర్ణయం చెబుతానని అన్నారని చెప్పారు. ఎంపీలు పార్టీ మారడంపై కూడా తోట స్పందించారు. ఎంపీలు పార్టీలు మారడం వారి వ్యక్తిగత విషయమని అన్నారు. పార్టీ మారే సమయంలో విమర్శలు చేయడం సహజమన్నారు. తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

 

తోట నర్సింహం తన భార్య కోసం జగ్గంపేట సీటు అడగటం చంద్రబాబుని ఇరకాటంలో పడేసింది. జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నారు. నెహ్రూ 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత టీడీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కాదని జగ్గంపేట టికెట్ నర్సింహం భార్యకు చంద్రబాబు కేటాయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. జగ్గంపేట పంచాయితీని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.