TPCC expelled Marri Shasidhar Reddy from Congress for 6 years
Marri Sashidhar Reddy: మాజీ మంత్రి, కేంద్ర ప్రభుత్వ విపత్తు నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. కొద్ది రోజులుగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ చర్యలకు దిగింది. శుక్రవారం శశిధర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలుసుకోవడంపై పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు చీఫ్ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ వేటు పడినట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో టీపీసీసీ పేర్కొంది.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ఆయన ముందే వదిలేశారు. టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకోక ముందే తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ పదాన్ని తొలగించారు. ఆయన బీజేపీలో చేరనున్నారనేది కూడా ఇప్పటికే స్పష్టవైపోయింది. అంతే కాకుండా, పార్టీ నుంచి అధికార ప్రకటన రాకముందే కాంగ్రెస్ పార్టీపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని ఆయన విమర్శించారు.