ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి
ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి 14ఏళ్ల క్రితమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచన చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. హైకోర్టు బెంచ్ కు రాజమండ్రి అనుకూలమని లేఖలో తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటును పరిశీలించాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కి జగన్ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇవ్వాలన్నారు. ఇసుక విధానంపై ఉండవల్లి విమర్శలు చేశారు. ఇసుక ఆన్ లైన్, డోర్ డెలివరీ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. బుధవారం(ఫిబ్రవరి 19,2020) మీడియాతో మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్.
కేంద్ర, రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. 51శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ను జైల్లో పెట్టే సాహసం కేంద్రం చేయదని తేల్చి చెప్పారు. తమిళనాడులో శశికళ వ్యవహారం వేరు, జగన్ కేసుల వ్యవహారం వేరని అన్నారు. ఎన్డీయేలో జగన్ చేరతారని వస్తున్న వార్తలపై స్పందించిన ఉండవల్లి.. ఎన్డీయేలో జగన్ చేరతారని అనుకోవడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు ఇవ్వనప్పుడు.. నేను జైలుకెళ్లడం ఉత్తమమని ప్రధాని మోడీకి జగన్ చెప్పి ఉంటే బాగుండేదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
ప్రధాని మోడీపై వ్యతిరేకత ఉన్నా.. దేశంలో సరైన నాయకుడు లేడని.. అది బీజేపీకి ప్లస్ అవుతోందని ఉండవల్లి అన్నారు. ప్రస్తుతానికి మోడీకి ధీటైన ప్రధాని అభ్యర్థి లేరన్న ఉండవల్లి.. భవిష్యత్తులో వస్తారని చెప్పారు. ఏపీలో ఐటీ దాడులపైనా ఉండవల్లి స్పందించారు. ఐటీ దాడులు జరగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. చంద్రబాబుకి, మోడీకి పడటం లేదని చెప్పారు.