Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మార్చడంలో 27 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తి చరిత్ర తెలుసుకోండి.

న్యాయ మంత్రి తంబి దురై ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లేచి నిలబడ్డారు. ఆ సమయంలో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది. తోపులాట కూడా జరిగింది. కొందరు ఎంపీలు ఆయన చేతుల్లోంచి బిల్లు కాపీని తీసుకుని లోక్ సభలోనే చించివేశారు

Women Reservation Bill: కొత్త పార్లమెంట్ హౌస్‌లో తొలిరోజునే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ దీనిని ప్రవేశపెట్టారు. కాగా, ఈ బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరగనుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. గురువారం రాజ్యసభలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

అయితే, ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం ఇదే మొదటిసారి కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లులను గతంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఈ బిల్లును చట్టం చేయడంలో ఎందుకు విఫలమయ్యారు? బిల్లు ఇప్పుడు చర్చకు ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలుసుకుందాం..

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?
రెండు దశాబ్దాలకు పైగా మహిళా రిజర్వేషన్‌ అంశాన్ని లేవనెత్తని పార్లమెంట్‌ సమావేశాలేవీ లేవు. నారీ శక్తి వందన్ చట్టం పేరుతో 128 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీని కింద లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి నిబంధన ఏర్పడతుంది. ఇది అమలులోకి వస్తే.. 33 శాతం అంటే.. మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయిస్తారు. అలాగే అందులో 33 శాతం సీట్లు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేస్తారు.

దేశంలో మహిళా రిజర్వేషన్ చరిత్ర ఏమిటి?
మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా 1996లో దేశ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అయితే 1992లో 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా దాని పునాది ఇప్పటికే వేయబడింది. నిజానికి అధికార వికేంద్రీకరణ కలను నిజం చేసేందుకు 73వ, 74వ రాజ్యాంగ సవరణలు చేయాలని నిర్ణయించారు. 1992లో పివి నరసింహారావు ప్రభుత్వ హయాంలో రెండు సవరణలు ఆమోదించబడ్డాయి. ఇవి జూన్ 1, 1993 నుంచి జాతీయ స్థాయిలో అమలు చేశారు. రాజ్యాంగంలో 243(డీ), 243 (టీ) అధికరణలు చేర్చబడ్డాయి. దేశంలోని పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లను రిజర్వు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-డీ నిబంధనల ప్రకారం, పంచాయితీ రాజ్ సంస్థలలో మూడింట ఒక వంతు సీట్లు, రాజ్యాంగంలోని 9వ భాగం ప్రకారం.. పంచాయతీ రాజ్ సంస్థలలోని అన్ని స్థాయిల చైర్‌పర్సన్‌ల పదవులలో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించారు. అదే సమయంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-టీ ప్రతి మునిసిపాలిటీలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేయబడిన మొత్తం సీట్లలో కనీసం మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఏమిటి?
27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది. అయితే, మొదటిసారిగా దీనిని హెచ్‌డీ దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 12 సెప్టెంబర్ 1996న 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టింది. అధికార పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అప్పటి న్యాయ మంత్రి రమాకాంత్ డీ ఖలప్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

లాలూ ప్రసాద్‌, ములాయం సింగ్‌ యాదవ్‌, మాయావతి, శరద్‌ యాదవ్‌లతో సహా పలువురు నేతలు దీనిపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు 50 శాతం కేటాయించాలని వారి వాదన. బిల్లు చివరికి లోక్‌సభ సభ్యురాలు గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపబడింది.

అటల్ ప్రభుత్వంలో కూడా ఈ బిల్లు తెచ్చారు
జేపీసీ తన నివేదికను 9 డిసెంబర్ 1996న 11వ లోక్‌సభలో సమర్పించింది. ఈ బిల్లు తర్వాత 12వ లోక్‌సభలో 26 జూన్ 1998న అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ బిల్లుగా తిరిగి ప్రవేశపెట్టబడింది. 1998లో అప్పటి న్యాయ మంత్రి తంబి దురై ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లేచి నిలబడ్డారు. ఆ సమయంలో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది. తోపులాట కూడా జరిగింది. కొందరు ఎంపీలు ఆయన చేతుల్లోంచి బిల్లు కాపీని తీసుకుని లోక్ సభలోనే చించివేశారు. అనంతరం 2002, 2003లో కూడా ఈ ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఈ బిల్లు ఆమోదం పొందలేదు.

యూపీఏ ప్రభుత్వ ఉమ్మడి కార్యక్రమంలో బిల్లు
మే 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, సంకీర్ణ ప్రభుత్వ ఎజెండాలో ఈ బిల్లును చేర్చారు. అసెంబ్లీలు, లోక్‌సభల్లో మహిళలకు మూడొంతుల రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కానీ లోక్‌సభలో బిల్లును ఆమోదించడంలో యూపీఏ ప్రభుత్వం కూడా విఫలమైంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు 2010 నుంచి పెండింగ్‌లో ఉంది
మహిళా రిజర్వేషన్ల కోసం 108వ రాజ్యాంగ సవరణ బిల్లును 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారు. ఇది మార్చి 9, 2010న రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. ఆ తర్వాత 2014లో లోక్‌సభ రద్దయింది. రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత కూడా లోక్‌సభలో మళ్లీ ఆమోదం పొందలేకపోయింది. దీనికి ప్రధాన కారణం SP, BSP, RJD తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. బహుజన వర్గాలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని ఆ పార్టీలు గట్టి పట్టు పట్టడంతో ఈ బిల్లు సందిగ్ధంలో పడింది.

మోదీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును ఆమోదించగలదా?
మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు సొంత మెజారిటీ లేదు. అనేక పార్టీల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం.. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదించడానికి ఆ పార్టీలు సిద్ధంగా లేవు. కానీ ప్రస్తుత లోక్‌సభలో అధికార కూటమికి మెజారిటీ ఉండడంతో పాటు, ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తామని బహిరంగంగానే ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకువస్తోంది. ఇది భారతదేశంలోని పార్లమెంటు, శాసన సభలలో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు