ఎందుకీ మౌనం : ఎన్నికల తర్వాత ఏపీకి దూరంగా జగన్

  • Publish Date - May 7, 2019 / 07:25 AM IST

వ‌చ్చేది మా ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే… అది చేస్తాం.. ఇది చేస్తామని వైఎస్ జ‌గ‌న్ పదే పదే చెబుతుంటారు. అధికారం సంగ‌తి అటుంచితే ఉన్న అవకాశాన్ని మాత్రం స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేదంటూ అయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఎన్నికలు జరిగి నెల రోజులవుతున్నా ఏ ఒక్క ప్రజా సమస్యపైనా స్పందించకపోవటం.. అధికారపార్టీ చెప్పినట్లే.. హైదరాబాద్ కే పరిమితం కావటం జగన్ పై విమర్శలకు తావిస్తోంది.
 
ఎన్నికలకు ముందు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్.. ఎన్నికలు ముగిశాక మాత్రం ఏపీలో అడుగు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. కీల‌క స‌మ‌యాల్లో జ‌గ‌న్  స్పందించ‌క‌పోవ‌డం… క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడంతో… ఆయ‌న‌పై విమ‌ర్శలు ఎక్కుపెడుతున్నారు ప్రత్యర్ధులు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ నిత్యం ప్రజ‌ల్లో గ‌డిపిన జ‌గ‌న్ ఎన్నిక‌ల త‌రువాత ఏ విష‌యంపైనా నేరుగా స్పందించ‌లేదు.

ఉత్తరాంధ్ర ఫొని తుఫాన్ తో గజగజ వణికింది. రాష్ట్రంలో తీరం దాటకపోయినా.. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పెను నష్టాన్నే కలగజేసింది. తుఫాన్ వచ్చినప్పుడు జగన్‌ హైదరాబాద్‌లోనే ఉన్నా.. శ్రీకాకుళానికి వెళ్లాలన్న ఆలోచన చేయలేదు. కేవలం.. తుఫాన్ బాధితులకు సాయం చేయాలని పార్టీ నేతలకు ఆదేశించి ఊరుకుండిపోయారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానంటూ చెబుతున్న జగన్.. ఈ సమయంలో తుఫాన్ బాధితులను పరామర్శించి ఉంటే.. ఆయనపై జనంలో మరింత నమ్మకం పెరిగి ఉండేది. గ‌తంలో తిత్లీ తుఫాను స‌మ‌యంలోనూ జగన్‌ ఇలానే వ్యవహరించారు. తిత్లీ కారణంగా శ్రీకాకుళంలో భారీగా నష్టం సంభవించినా… పక్క జిల్లాలోనే పాదయాత్ర చేశారే తప్ప.. ఒక్కరోజు కూడా బాధితులను పరామర్శించడానికి వెళ్లలేదు.

తూర్పుగోదావ‌రి జిల్లా దేవిప‌ట్నం మండ‌లంలో ప‌డ‌వ బోల్తా ప‌డి 23మంది చ‌నిపోతే కూడా జ‌గ‌న్ అక్క‌డికి వెళ్లలేదు. తాను పాద‌యాత్ర‌లో ఉన్నాన‌ంటూ పార్టీ నేత‌ల‌ను మాత్ర‌మే పరామర్శలకు పంపించారు. ఈ రెండు సంఘటనల్లోనూ జగన్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లోనూ టీడీపీ దీన్నే ప్రధానంగా ప్రచారం చేసింది. జగన్ సీఎం అయితే.. లోటస్‌పాండ్‌కే పరిమితం అవుతారంటూ విమర్శించింది. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి ఫొని రూపంలో జగన్‌ ముందుకు ఓ అవకాశం వచ్చింది. కానీ దాన్ని ఆయన జారవిడుచుకున్నారన్న వాదన వినిపిస్తోంది.

ఏపీలో ఎన్నికలు ముగిసి నెల రోజులు కావొస్తోంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలాచోట్ల తాగునీటి సరఫరా సరిగ్గా జరగక జనం విలవిలలాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. ఇలాంటి విషయాల్లో క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులపై ఒత్తిడి తెస్తే.. ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.

రాజకీయంగానూ జగన్‌ వ్యవహారశైలి ఆ పార్టీ నేతలకే అంతుబట్టకుండా ఉంది. ఓ వైపు పోలింగ్ సరళిపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షల మీద సమీక్షలు చేస్తూ.. ఈవీఎంల మీద పోరాడుతూ హడావుడి చేస్తుంటే.. జగన్ మాత్రం కనీసం పార్టీ నేతలను కలవడానికి కూడా పెద్దగా సమయం కేటాయించడం లేదన్న వాదన వినిపిస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే భారీ మెజారిటీతో గెలుస్తామని ప్రకటించడం మినహా.. ఓటింగ్ ఎలా జరిగిందన్న దానిపై ఇంతవరకూ సమీక్షన్నదే చేయలేదు. కనీసం పోటీ చేసిన అభ్యర్థులను పిలిచి వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకునే ప్రయత్నమూ చేయలేదు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల విషయంలో విజయవాడకు రాంగోపాల్ వర్మ వెళ్లడం.. పోలీసులు అరెస్ట్ చేయడంపై మాత్రం జగన్ స్పందించారు. ఈసీ అనుమతి లేకుండా సినిమా విడుదల చేయడానికి ప్రయత్నించిన వర్మను వెనుకేసుకొస్తూ జగన్ ట్వీట్ చేయడం వివాదాస్పదమయ్యింది.

జగన్ వ్యూహాత్మకంగానే సైలెంట్ గా ఉంటున్నారని అంటున్నారు ఆ పార్టీ నేత‌లు. పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నా మౌనంగా ఉండడమే బెటర్ అని జగన్ భావిస్తున్నారట. గ‌తంలో అతి చేయడం వ‌ల్ల‌ ఇబ్బంది పడ్డామని, ఈసారి అలాంటి వాటికి దూరంగా ఉండాలని జగన్ సైలెంట్ గా ఉన్నార‌నేది పార్టీ నేత‌ల వాద‌న‌. రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో సైలెంట్ గా ఉన్నా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల విష‌యంలో స్పందించాల్సిన అవ‌స‌రం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.