తూర్పుగోదావరి: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరిగా మంత్రి యనమల రామకృష్ణుడికి గుర్తింపు ఉంది. వరుసగా 6 సార్లు ఆయన తుని నుంచి విజయం సాధించారు.
తూర్పుగోదావరి: ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతల్లో ఒకరిగా మంత్రి యనమల రామకృష్ణుడికి గుర్తింపు ఉంది. వరుసగా 6 సార్లు ఆయన తుని నుంచి విజయం సాధించారు. సుదీర్ఘకాలం పాటు మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా, పీఏసీ చైర్మన్‌గా పదవులు అనుభవించారు. అయినా సొంత నియోజకవర్గంలో ఆయనకు చుక్కలు కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో యనమల ఈసారి విజయం దక్కించుకుంటారా..? వైసీపీ దెబ్బకు డీలా పడతారా..?
యనమల రామకృష్ణుడు.. సీనియర్ రాజకీయ నేత. యనమలకు అసెంబ్లీ వ్యవహారాల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉంది. 1983లో ఎన్టీఆర్ ఆశీస్సులతో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. సాధారణ లాయర్‌గా రాజకీయాల్లోకి వచ్చి అసాధారణంగా ఎదిగారు. అనూహ్యమైన విషయ పరిజ్ఞానంతో సభా నిర్వహణలో ఆయనది అందెవేసిన చేయిగా చెబుతారు. కానీ ఆ అనుభవం సొంత అసెంబ్లీ సీటులో అక్కరకు రావడం లేదు. 1983 నుంచి 2004 వరకూ వరుసగా 6 సార్లు విజయం సాధించినప్పటికీ.. ఆ తర్వాత పరాజయాల పరంపర కొనసాగుతోంది.
2009లో యనమల పరాజయం పాలయ్యారు. 2014లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు గట్టెక్కలేక చతికిలపడ్డారు. ఇక ఇప్పుడు వరుసగా మూడో ఓటమి దరి చేరనివ్వకూడదని యనమల గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధిని చూపించి.. 2019లోనైనా విజయం సాధించాలన్నది యనమల బ్రదర్స్ వ్యూహం. కానీ పరిస్థితులు అందుకు తగ్గట్లుగా ఉన్నాయా అంటే సందేహంగానే చెప్పవచ్చు. సుదీర్ఘకాలంగా యనమలకు చేదోడుగా నిలిచిన సొంత మండలం తొండంగిలో ఇప్పుడు టీడీపీ చెమటలు కక్కుతోంది.
ఈసారి కూడా సోదరుడు యనమల కృష్ణుడిని బరిలో దింపేందుకు యనమల సన్నద్ధమయ్యారు. ఆయన మాత్రం ఎమ్మెల్సీ పదవిని చేపట్టి ప్రత్యక్ష ఎన్నికల నుంచి ఇక దూరమైనట్టే కనిపిస్తున్నారు. కానీ సోదరుడి గెలుపు ఇప్పుడు యనమల రామకృష్ణుడికి కత్తి మీదసాములా మారింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకునేందుకు ఏదో రకంగా గట్టెక్కాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. అందు కోసమే యనమల సొంత నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరించారు. కానీ ఫలితాలు అంత సులువుగా దక్కేలా లేదన్నది పరిశీలకుల వాదన. ఎందుకంటే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మరోసారి బరిలో నిలవబోతున్నారు. ఆయనకు పోటీగా టీడీపీ తరుపున యనమల కృష్ణుడు రంగంలో సిద్ధమవుతున్న వేళ .. జనసేన ప్రభావమే ఇక్కడ కీలకం కాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో యనమల వ్యూహం ఫలిస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఫలితాలు ఎటు మొగ్గు చూపుతాయో చూడాలి.