Delimitation Process: మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల నుంచి గట్టి ఆమోదం లభించింది. లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఇక రాజ్యసభలో ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు లభించింది. అయితే ఇది ఇప్పడప్పుడే అమలులోకి రాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది అమలులో వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? మహిళలకు రిజర్వ్ స్థానాలను ఎలా కేటాయిస్తారు? ఎక్కడ కేటాయిస్తారు? ఎవరు కేటాయిస్తారనే ప్రశ్నలు సహజంగానే వస్తుంటాయి. మరి అవేంటో ఓసారి చూద్దాం..
డీలిమిటేషన్ ప్రధాన కారణం
మహిళా రిజర్వేషన్ కోసం చట్టం చేయడంలో జాప్యానికి అతిపెద్ద కారణం డీలిమిటేషన్ (నియోజకవర్గా పునర్ వర్గీకరణ). దేశ జనాభా గణన తర్వాత డీలిమిటేషన్ జరుగుతుంది. దాని కారణంగా ఆలస్యం అవుతుంది. ఈ బిల్లు చట్టంగా మారడానికి 2029 తర్వాత కూడా సమయం పట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం 2029 నాటికి ఇది అమలులోకి వస్తుంది. అయితే, ఇందులో చాలా చిక్కులు ఉన్నాయి. పార్లమెంట్‌లో అమిత్ షా చేసిన ప్రకటన ప్రకారం, 2024 ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జనాభా గణనను ప్రారంభిస్తే, డేటా బయటకు రావడానికి కేవలం రెండేళ్లు మాత్రమే పడుతుంది.
డీలిమిటేషన్ అంటే ఏమిటి?
డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి గీయడం. డీలిమిటేషన్ కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. దీనిని డీలిమిటేషన్ కమిషన్ అంటారు. ఈ కమిషన్ ఏ నియోజకవర్గానికైనా పరిమితులను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. 2026 వరకు దేశంలోని నియోజకవర్గాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడంపై పార్లమెంటు నిషేధం విధించింది. అంటే జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. డీలిమిటేషన్ సాధారణంగా మూడు-నాలుగు సంవత్సరాలు పడుతుంది. అయితే ఇది రెండు సంవత్సరాలలో కూడా చేయవచ్చు. రాజ్యాంగం ప్రకారం డీలిటేషన్ కమిషన్ ఉత్తర్వులు అంతిమమైనవి. దీనిని ఏ కోర్టు కూడా ప్రశ్నించదు. అవసరమైతే ఇది ఎన్నికలను నిరవధికంగా నిలిపివేస్తుంది. అదేవిధంగా, లోక్‌సభ లేదంటే రాష్ట్ర అసెంబ్లీలు కూడా కమిషన్ ఆదేశాలలో ఎలాంటి సవరణలు చేయలేవు.
డీలిమిటేషన్ అవసరం ఎందుకు?
డీలిమిటేషన్ అవసరం ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత జనాభా గణన జరిగినప్పుడల్లా, జనాభాను సజాతీయంగా మార్చడానికి, ప్రజలకు సమాన ప్రాతినిధ్యాన్ని అందించడానికి నియోజకవర్గాన్ని చిన్నదిగా లేదా పెద్దదిగా చేయాలి.
ఏ ఎన్నికలలోనైనా ఏ రాజకీయ పార్టీ ఇతరులపై అగ్రస్థానాన్ని పొందకుండా ప్రాంతాలను సరిగ్గా విభజించడం కూడా చాలా ముఖ్యం. మన దేశ ఎన్నికల మూల సూత్రమైన ‘ఒక ఓటు, ఒకే విలువ’ అనే సూత్రాన్ని అనుసరించడం కూడా అవసరం.
డీలిమిటేషన్ కమిషన్‌ను ఎవరు నియమిస్తారు?
డీలిమిటేషన్ కమిషన్‌ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఇది ఎన్నికల సంఘం సహకారంతో పని చేస్తుంది. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఉంటారు. 1950-51లో ఎన్నికల సంఘం సహాయంతో రాష్ట్రపతి తొలిసారిగా డీలిమిటేషన్ పనులు చేపట్టారు. డీలిమిటేషన్ కమిషన్ చట్టం 1952లో రూపొందించబడింది. 1952, 1962, 1972, 2002 చట్టాల ప్రకారం డీలిమిటేషన్ కమిషన్లు ఇప్పటివరకు నాలుగు సార్లు మాత్రమే ఏర్పడ్డాయి.
సీటు ఎలా రిజర్వ్ చేసుకోవాలి?
ఇప్పటి వరకు లోక్‌సభలోని కొన్ని స్థానాలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్ లభించనుంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపు తర్వాత ఆయా ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి సంఖ్య ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు ఇస్తారు. మహిళా రిజర్వేషన్ విషయంలో కూడా ఇదే ఫార్ములాను అవలంబించవచ్చని భావిస్తున్నారు.