హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తామన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని జగన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో 25 కు 25 ఎంపీ సీట్లు ప్రజలు వైసీపీకి ఇస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని సర్వేలు చెబుతున్నాయని జగన్ అన్నారు. రాష్ట్రంలో 25కి 25 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలోని హామీలు అమలు చేయించుకోవచ్చన్నారు. ఎన్నికలకు ముందే పొత్తులు పెట్టుకుంటే నష్టపోతామని జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్టప్రకారం విశాఖపట్నానికి రైల్వే జోన్ రావాలని జగన్ అన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలకూ రైల్వే జోన్ ఉందని గుర్తు చేశారు. కానీ ఏపీకి లేకపోవడం దురదృష్టకరమన్నారు. జోన్ కోసం వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. వైసీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా నమోదైన కేసులు ఎత్తివేయడంలో చంద్రబాబు పక్షపాతం చూపారని.. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాల కారణంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో తటస్ధుల ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా ‘అన్న పిలుపు’ పేరుతో జగన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి మంచి చేసే దిశగా మీ సహకారాన్ని ఆశిస్తున్నానంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. తటస్థులు, మేధావులు, సమాజ సేవలో ఉన్నవారితో సమావేశమవుతారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు.