తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని GHMC అధికారులను కేంద్ర బృందం హెచ్చరించింది. లాక్‌డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఇచ్చారని, కేసులు మరింత పెరిగే అవకాశముందని సూచించింది. ఢిల్లీ, ముంబయి, చెన్నైలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లలో కూడా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారని… ప్రైవేటుగా నిర్వహించిన పరీక్షల్లోనే 70 శాతం పైబడి పాజిటివ్ కేసులు వస్తున్నట్లుగా గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో… ఇక్కడి పరిస్థితులపై ఆరా తీసేందుకు కేంద్రం నుంచి ప్రత్యేకబృందం 2020, జూన్ 10వ తేదీ బుధవారం భాగ్యనగరానికి వచ్చింది. GHMC కార్యాలయంలో కమిషనర్ లోకేష్‌కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతితోపాటు ఇతర అధికారులతో కేంద్ర బృందం సభ్యులు భేటీ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జోన్లు, సర్కిళ్లు, వార్డులవారిగా నెలకొన్న పరిస్థితి గురించి ఆరా తీశారు. జీహెచ్‌ఎంసీలో కరోనా కట్టడి చర్యలను అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు హోం కంటైన్‌మెంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమని కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రెటరీ సంజయ్ జాజు తెలిపారు. రోజుకు 100 కేసులకంటే ఎక్కువగా నిర్థారణ అవుతున్నందున జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నాలుగు జిల్లాల కలెక్టర్లు, వైద్య అధికారులు, డిప్యూటీ కమిషనర్లతో వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమన్వయపర్చుకోవాలని సూచించారు. కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రజల సహకారం చాలా కీలకమని అన్నారు.
Read: తెలంగాణలో 4,111కి చేరిన కరోనా కేసులు, 156 మంది మృతి