అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజులు పాటు హరహర మహాదేవ స్మరణతో మార్మోగనున్న హిమగిరులు

ప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది.

Amarnath Yatra 2024: దైవం మనిషిలో మనశ్శాంతిని నింపుతుంది. దేవుడి దివ్య దర్శనం ఆధ్యాత్మిక చింతనను పెంచుతుంది. అందుకే సహసమే ప్రాణంగా.. ఏడాదికి కొన్ని రోజులు మాత్రమే దక్కే ఆ అమరేశ్వరుడి దివ్యదర్శన భాగ్యం కోసం భగీరథ ప్రయత్నమే చేస్తారు భక్తులు. అందుకే కష్టాలకు ఓర్చి హిమగిరుల్లో సాహసయాత్ర చేస్తారు. ప్రతీ ఏడాది కొన్ని రోజుల పాటే శివనామస్మరణతో మార్మోగుతుంటాయి హిమగిరులు. సృష్టి రహస్యాన్ని.. అమరత్వాన్ని శివుడు పార్వతికి వివరించిన పుణ్యస్థలం అమర్‌నాథ్. దాదాపు ఐదు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అమర్‌నాథ్ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి హిందువూ తపిస్తారు. అమర్‌నాథ్ పేరుతో మంచులింగాన్ని పూజించినా.. మానససరోవరం పేరుతో సరస్సుని కొలిచినా ఎన్నో జన్మల పుణ్యం. దర్శించుకోవాలని కోరుకుంటే సరిపోదు.. ఆ పరమశివుడి అనుగ్రహం లేకుంటే ఆ మహిమాన్విత క్షేత్రాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదనేది భక్తుల విశ్వాసం.

52 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్ర..
పరమ పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29 నుంచి ఆగస్ట్ 19వరకు యాత్ర జరగనుంది. ముందుగా స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకుండా ఏ ఒక్కరూ నేరుగా దర్శనం చేసుకోవడానికి వీళ్లేదు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోనివారు..అమర్‌నాథ్ యాత్ర నడిచే మార్గాల్లో స్పాట్ రిజిస్ట్రేషన్ సెంటర్లు పెట్టారు. ఇప్పటికే దర్శనం కోసం 3లక్షల 60వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో లక్షా 50వేల మంది వరకు డైరెక్ట్‌గా యాత్రకు వచ్చి స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లలో పెట్టిన స్పెషల్ కౌంటర్లలో రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఓవరాల్‌గా ఈసారి 5లక్షల పైచిలుకు యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. రద్దీ దృష్ట్యా ఈ ఏడాది రోజుకు 5వేల నుంచి ఆరు వేల మంది దర్శనం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఏటవాలు మార్గంలో ట్రెక్కింగ్
16 వందల మందితో ఫస్ట్ బ్యాచ్, 4వేల 603 మంది యాత్రికులతో సెకండ్ బ్యాచ్ ఇప్పటికే భగవతి నగర్‌లోని బేస్ క్యాంప్‌కు చేరుకున్నాయి. శనివారం వీళ్లు తొలి దర్శనం చేసుకోనున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న అమర్‌నాథ్ క్షేత్రానికి వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి పహల్‌గామ్ బేస్ క్యాంపు నుంచి నున్వాన్ మీదుగా వెళ్తుంది. ఈ మార్గం దాదాపు 48 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండోది బల్తాల్ బేస్ క్యాంపు సెంట్రల్ కశ్మీర్‌లోని గండర్బల్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ మార్గంలో వెళ్లడం అత్యంత సవాల్‌తో కూడుకున్నది. ఏటవాలుగా ఉండే ఈ మార్గంలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారే బల్తాస్ బేస్ క్యాంప్ మార్గంలో వెళ్లాలని అమర్‌నాథ్ టెంపుల్ బోర్డు సూచిస్తోంది.

అందుబాటులో హెలికాప్టర్ సౌకర్యం
పహల్‌గామ్‌ మీదుగా అమర్‌నాథ్ గుహను చేరుకోవడానికి దాదాపు 5 రోజుల సమయం పడుతుంది. అక్కడికి చేరుకోవడానికి భక్తులు సాధారణంగా పోనీలను ఉపయోగిస్తారు. ఇక జమ్మూ నుంచి బాల్తాల్‌ వరకు టాక్సీలు అద్దెకు తీసుకోవచ్చు. దీని ద్వారా అమర్‌నాథ్ గుహకు వెళ్లవచ్చు. అమర్‌నాథ్ తర్వాత పహల్‌గామ్‌, సోన్‌మార్గ్, గద్సర్ సరస్సు, బేతాబ్ వ్యాలీ, విషన్సర్ సరస్సు, అరు ఘాటి, బల్సరన్‌ను చూడొచ్చు. హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

రాఖీ పౌర్ణమి వరకు యాత్ర 
హిమాలయాల్లో దాదాపు 3 వేల 880 మీటర్ల ఎత్తులో అంటే దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం ఉంటుంది. మంచు రూపంలో శివుడు, పార్వతి, గణపతి కొలువైన ప్రదేశంగా ఈ మహాక్షేత్రం ప్రతీతి. జీవితంలో ఒక్కసారైనా శివుడి దర్శనం కోసం పరితపించే భక్తులు ఏటా భారీగా తరలివస్తుంటారు. శ్రీనగర్ నగరానికి ఈశాన్యంగా 145 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమర్‌నాథ్ క్షేత్రం. ఈ గుహ పొడవు 19 మీటర్లు, వెడల్పు 16 మీటర్లు. సహజమైన ఈ గుహాలయంలో మంచుతో అతి సహజంగా శివలింగం ఆవిర్భవిస్తుంది. ఏటా ఆషాఢ మాసంలో మొదలయ్యే యాత్ర రాఖీ పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత మంచు కారణంగా యాత్ర కొనసాగించడం అసాధ్యం.

100 పడకల ఆసుపత్రులు
అమర్‌నాథ్ గుహ.. శివుని ప్రధాన ధార్మిక క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడే పరమశివుడు.. పార్వతిదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పాడు. అందుకే ఇది అమర్‌నాథ్ యాత్రగా మారింది. ఇక యాత్రకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా .. చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారుల. రెండు బేస్‌ క్యాంపుల దగ్గర 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైతే.. తరలించేందుకు అంబులెన్సులు..అవసరమైతే హెలికాప్టర్ల ద్వారా కూడా లిఫ్ట్ చేయనున్నారు.

Also Read: వారాహి అమ్మవారి దీక్ష ఎందుకు చేస్తారు? వారాహి అమ్మవారు ఎవరు?

జన్మసార్థకం చేసుకోవాలని..
ప్రతీ ఏడాది వేసవి అయిపోయాకే ఈ మహాద్భుత శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది. అదీ సమయానుకూలంగా ఏడాదిలో నెల నుంచి రెండు నెలల మధ్యే ఉంటుంది. అమర్‌నాథ్‌ గుహ మీదుగా జారే నీటిబొట్లు లింగాకారంలోకి మారుతాయ్. వేల ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది. ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఎన్నో కష్టాలను ఓర్చి హరహరుడిని దర్శించుకుంటారు. అమర లింగేశ్వరుడిని దర్శించి జన్మసార్థకం చేసుకోవాలని.. ఆ క్షణాన్ని జీవితకాలం జ్ఞాపకంగా మార్చుకోవాలని భక్తులు భావిస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు