Angaraka Sankatahara Chaturthi 2026 : మే నెలలో అత్యంత శక్తివంతమైన అంగారక సంకటహర చతుర్థి.. తేదీ, పూజా విధానం..!
Angaraka Sankatahara Chaturthi 2026 : మే నెలలో అత్యంత శక్తివంతమైన అంగారక సంకటరహర చతుర్థి రాబోతుంది. ఇంతకు ఈ పర్వదినం ఎప్పుడు.. పూజా విధానం వంటి వివరాలు..
- Dharani Pilli
- Updated on- May 1, 2026 / 09:56 PM IST
angaraka sankatahara chaturthi on may 5th 2026 puja muhurat fasting rules and significance
Angaraka Sankatahara Chaturthi 2026 : గణపతిని పూజించడానికి ఉద్దేశించిన అత్యంత పవిత్రమైన వ్రతాలలో సంకటహర చతుర్థి ఒకటి. ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే నాలుగవ రోజున (చవితి నాడు) ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ‘సంకటహర’ అంటే సంకటాలను (కష్టాలను) హరించేది అని అర్థం. ప్రతి నెలా సంకటహర చతుర్థి వచ్చినా.. అది మంగళవారం నాడు వస్తే దానిని ‘అంగారక సంకటహర చతుర్థి’ అని పిలుస్తారు. దీనిని అత్యంత విశిష్టమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు. 2026లో ఇప్పటికే ఒకసారి అంగారక సంకటహర చతుర్థి రాగా, మే నెలలో మరోసారి రావడం విశేషం.
మంగళవారం నాడు వచ్చే ఈ చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని, సంపద కలుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ ఒక్క వ్రతం ఆచరిస్తే సంవత్సరమంతటా సంకటహర చతుర్థి ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇది గణేశుడి ఆశీర్వాదాలను, అంగారకుడి (కుజుడు) శక్తిని ఏకం చేస్తుంది.
పూజా సమయం (మే 2026):
-
చతుర్థి తిథి ప్రారంభం: మే 05, ఉదయం 5:24 గంటలకు
-
చతుర్థి తిథి ముగింపు: మే 06, ఉదయం 7:51 గంటల వరకు
అంగారక సంకటహర చతుర్థి రోజున చేసే పూజ వల్ల ఆరోగ్యం చేకూరుతుంది, కర్మ సంబంధిత అవాంతరాలు తొలగిపోతాయి. సుఖసంతోషాలతో కూడిన వైవాహిక జీవితాన్ని, మంచి సంతానాన్ని, ఉజ్వల భవిష్యత్తును ఈ వ్రతం ప్రసాదిస్తుందని నమ్ముతారు.
పూజా విధానం:
-
అంగారక సంకటహర చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత శ్రేష్ఠం.
-
పూజా స్థలాన్ని శుభ్రం చేసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
-
చేతిలో బియ్యం, పువ్వులు పట్టుకొని ఉపవాసం ఆచరిస్తానని సంకల్పం చెప్పుకుని, వాటిని గణేశుడికి సమర్పించాలి.
-
పూజా ద్రవ్యాలుగా బెల్లం, పువ్వులు, అటుకులు, ధూపం, చందనం, రాగి పాత్రలో నీరు, పండ్లను ఉంచాలి.
-
గణపతి విగ్రహానికి సింధూర తిలకం దిద్ది, ఆయనకు ఇష్టమైన గరిక, ఎర్రటి పువ్వులు, ధూప దీపాలు సమర్పించాలి.
-
మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
సాయంత్రం పూజా విధానం:
-
చతుర్థి ప్రధాన పూజ సాయంత్రం వేళ జరుగుతుంది. ఈ సమయంలో మరోసారి స్నానం చేసి పూజను ప్రారంభించాలి.
-
దేవుడి విగ్రహం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి, వినాయకుడికి తిలకం అద్ది, నీటిని సమర్పించాలి.
-
“ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని జపించాలి.
-
ఈ రోజు చంద్రోదయ సమయం రాత్రి 10:21 గంటలకు ఉంది. చంద్రుడిని దర్శించుకున్నాకే ఉపవాసం విరమించాలి.
-
పూజ సమయంలో గణపతి మంత్రాలను పఠిస్తూ, సంకష్ట చతుర్థి వ్రత కథను చదవడం లేదా వినడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి.
-
రాత్రి చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి, ఆ తర్వాతే ఉపవాస దీక్షను విరమించాలి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వబడింది. దీనిని 10tv నిర్ధారించడం లేదు
