Lord Shiva-Bilva Patra : సోమవారం శివయ్యను దీనితో పూజిస్తే.. ఆర్థిక కష్టాలు తీరి.. కనక వర్షం కురుస్తుంది..!

Lord Shiva-Bilva Patra : శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఆర్థిక సమస్యలు తీరడానికి వేటితో పూజిస్తే ప్రయోజనమో తెలియాలంటే..

monday shiva puja The Sacred Bilva Patra Significance Worship Rituals and Benefits for Prosperity

Lord Shiva-Bilva Patra : శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం. నేడు శివయ్యకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించి, ఉపవాసాలు ఉండి పూజిస్తారు. ఇదిలా ఉంటే సోమవారం నాడు శివుడిని ప్రత్యేకంగా మారేడు దళంతో పూజిస్తే.. ఊహించని ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. శివారాధనలో మారేడు (బిల్వం) చెట్టుకు అత్యున్నత స్థానం ఉంది. పురాణాల ప్రకారం, మారేడు ఆకులతో శివుడిని పూజిస్తే ఈ జన్మవే కాక గత జన్మ పాపాలు కూడా తొలగిపోవడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.

శ్రీ ఫలం: లక్ష్మీదేవి సృష్టి

ఈ ప్రకృతిలో మారేడు చెట్టు ఒక అద్భుతం. సాధారణంగా ఏ చెట్టుకైనా పూత నుంచి అంటే ముందు పూలు ఆ తర్వాత కాయలు వస్తాయి. కానీ మారేడు చెట్టు మాత్రం నేరుగా కాయలు కాస్తుంది. దీనిని లక్ష్మీదేవి సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి, అందుకే పండిన మారేడు కాయను ‘శ్రీ ఫలం’ అని పిలుస్తారు. దీనిని ఐదు లక్ష్మీ నివాస స్థానాలలో ఒకటిగా శాస్త్రం వర్ణించింది. పూర్వకాలంలో మారేడు కాయలోని గుజ్జును విభూతి తయారీలో కూడా ఉపయోగించేవారు.

త్రిదళం.. త్రిగుణాకారం!

మారేడు దళంలో మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఇవి సత్వ, రజ, తమో గుణాలకు.. అలాగే శివుని మూడు నేత్రాలకు చిహ్నాలుగా భావిస్తారు. అందుకే దీనిని స్తుతించేటప్పుడు:

“త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం | త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ||” అని పఠిస్తారు.

సాధారణంగా పూజకు మూడు ఆకులున్న దళాలను వాడతారు. కానీ అరుణాచలం వంటి క్షేత్రాలలో 9 ఆకులు ఉండే బహుబిల్వ దళాలు కూడా కనిపిస్తాయి. ఇతర పుష్పాలకు తొడిమ తీసి పూజించినా, మారేడు దళాన్ని మాత్రం కాడతో సహా శివలింగంపై ఉంచడం విశేషం.

ప్రదక్షిణ ఫలితం

మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మారేడు చెట్టు కింద కూర్చొని జపం చేస్తే త్వరగా సిద్ధి కలుగుతుందని నమ్మకం. యోగ్యుడైన ఓ వ్యక్తి మారేడు చెట్టు నీడలో ఆవు పేడతో అలికిన ప్రదేశంలో భోజనం పెడితే, అది కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి.

రోహిణి నక్షత్రం – దారిద్య్ర నివారణ పూజ

చంద్రుని నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో మారేడు చెట్టు కింద పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

పూజా విధానం: చెట్టు మొదట్లో నీరు పోసి, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, ధూపం వేయాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం పఠిస్తూ తాంబూలం (మూడు తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, దక్షిణ) సమర్పించాలి. ఈ పూజ చేసిన తర్వాత 2, 3 మంచి మారేడు ఆకులను ఇంటికి తెచ్చుకుని, ఒక దానిని బీరువాలో, మరొకటి మీ పర్సులో ఉంచుకుంటే ధనం స్థిరంగా నిలుస్తుందని పండితులు చెబుతున్నారు.

మారేడు దళాలను ఎప్పుడు కోయాలి (నియమాలు)

మారేడు ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు. వీటిని కోయడానికి శాస్త్రం కొన్ని కఠినమైన నియమాలను విధించింది:

  • కోయాల్సిన రోజులు: బుధవారం, శనివారాలలో మాత్రమే ఆకులను కోయాలి.

  • నిషిద్ధ రోజులు: సోమవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆకులను కోయకూడదు.

  • ప్రత్యామ్నాయం: పూజ కోసం ఆకులను ముందు రోజే కోసి భద్రపరుచుకోవాలి. మారేడు ఆకులు పవిత్రమైనవి, కాబట్టి ఒకసారి పూజించిన ఆకులను కడిగి తిరిగి మరుసటి రోజు కూడా పూజకు ఉపయోగించవచ్చని పండితులు చెబుతున్నారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్థారించడం లేదు.