Jangi Jathara: జంగీ జాతర విశిష్టత ఏంటో తెలుసా?

ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించుకునే అవకాశం..

Sadalpur Mahadev Jangi Jathara

చుట్టూ అడవి.. ఎటూ చూసిన పచ్చని వాతావరణం. మనసుకు ఆహ్లాదం పంచే ప్రకృతి. అచ్చుగుద్దినట్లు కనిపించే అలనాటి ఆలయ నిర్మాణ శైలి. నల్లటి రాయితో ఇప్పటికీ బలంగా కనబడుతున్న ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్‌పూర్‌ గ్రామంలోనిది.

గ్రామానికి సమీప అడవిలో ఈ ఆలయం ఉంది. జంగీ జాతర ప్రారంభమైంది. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని శాతవాహనులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ నల్లటి రాతితో నిర్మించిన ఆలయంలో శివలింగం స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. పక్కనే శిథిలావస్థలో ఉన్న ఆలయంలో భైరందేవుడు కొలువై ఉన్నాడు.

ఈ మహదేవ్-భైరందేవ్‌లను ఆదివాసీలతో పాటు ఇతర భక్తులు పెద్ద ఎత్తున ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర మాసంగా కొలిచే ఈ పుష్యమాసంలో వారం రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకి వివిద రాష్ట్రాల గిరిజనులతో పాటు తెలంగాణా-మహారాష్ట్ర భక్తులు భారీగా వస్తుంటారు.

కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం
మహాదేవ్- భైరందేవ్‌లను ఆరాధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడి వచ్చే భక్తులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. ఇక్కడ భక్తులు శివలింగానికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఇక భైరందేవ్‌కు కోళ్లు, మేకలు సమర్పించడం ఆనవాయితీ. అందుకే ఈ జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. మహదేవ్ ఆలయంలోని శివలింగాన్ని చేతితో పైకి ఎత్తి కోరికలు కోరుకుంటే.. తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

ప్రస్తుతం ఈ ఆలయం గ్రామస్థుల నిర్వహణలో కొనసాగుతోంది. ఈ ఆలయాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మొన్నటి వరకు భక్తులకు తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం మిషన్ భగీరథ వల్ల ఆ నీటి సమస్య తీరిపోయింది. ఇక ఎంతో పురాతన కోనేరు ఆలయం సమీపంలో ఉన్నప్పటికీ.. అది వాడుకలో లేకుండా పోయింది.

ఆలయం వరకు రోడ్డు నిర్మాణం.. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తే జాతర మరింత ఘనంగా నిర్వహించుకోవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న మహదేవ్ ఆలయం… పూర్తిగా కూలిపోయిన భైరందేవ్ ఆలయాల పునరుద్దరణ చర్యలు చేపట్టాల్సి ఉందని.. దానికి ప్రభుత్వం సహకరించాలని భక్తులు కోరుతున్నారు.

ఇక జాతర సమయంలో నిర్వహించే ప్రజా దర్బార్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను నేరుగా అధికారులకు విన్నవించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆలయంలో కాలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారి ప్రసాదాన్ని.. ఆలయ పూజారి గుడిపైకి ఎక్కి భక్తులపై చల్లుతూ ఉంటారు.

ఆ ప్రసాదం చేతికి అందిన వారు పరమేశ్వరుని ఆశీర్వదం లభించిందని భావిస్తారు. కాలా ను ప్రసాదంగా స్వీకరించడంతో పాటు కొందరు తమ పంట పొలాల్లో చల్లుకుంటారు. ఇలా చేస్తే పాడిపంటలు సమృద్ధిగా పండుతాయని మారుమూల ప్రాంత ప్రజల ప్రగాఢ నమ్మకం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం బాధకరమని.. గ్రామస్తులు వాపోతున్నారు. ఈ ఆలయాన్ని ఎండోమెంట్ కిందకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పురాతన కాలం నాటి చారిత్రాత్మక కట్టడాలు కనుమరుగు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఒడిలో ఎంతో రమణీయంగా ఉండే మహదేవ్, భైరందేవ్ ఆలయాల జీర్ణోద్ధరణకు సర్కార్ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని భక్తులు భావిస్తున్నారు.

Read Also: చంద్రబాబును కలిసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు

ట్రెండింగ్ వార్తలు