Sheetala Saptami : నేడే శీతల సప్తమి.. అమ్మవారికి ఈ నైవేద్యం సమర్పిస్తే.. రోగాల బారిన పడరు..!
Sheetala Saptami : నేడే శీతల సప్తమి. ఈ రోజు దుర్గా దేవిని శీతల మాతగా కొలుస్తారు. ఈ పండగ నాడు అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలంటే..
- Dharani Pilli
- Published On : March 10, 2026 / 07:34 AM IST
Sheetala Saptami 2026 Rituals during this festival and which prasadam offerd to goddess on this day
Sheetala Saptami : హిందువులు ఎంతో పవిత్రంగా జరుపుకునే అమ్మవారి పండుగ శీతల సప్తమి నేడు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ అయిపోయిన వారం రోజుల తర్వాత, అనగా ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష సప్తమి నాడు ఈ పండుగ చేసుకుంటారు. దేశమంతా జరుపుకునే పండుగ ఇది. దక్షిణ భారతదేశంలో నేడు గ్రామ దేవతలను పూజిస్తారు. శీతల సప్తమి పండుగ ప్రధాన ఉద్దేశం.. రోగాల బారిన పడకుండా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం. మార్చి 10న శీతల సప్తమి పండుగ. నేడు అమ్మవారికి కుడుముల నైవేద్యాన్ని సమర్పిస్తే.. రోగాల బారిన పడకుండా ఉంటారు. మరి నేడు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు.. ఏ సమయంలో పూజ చేయాలి అనే వివరాల కోసం..
మార్చి 10, మంగళవారం శీతల సప్తమి వచ్చింది. నేడు దుర్గా మాతను శీతల దేవి రూపంలో కొలుస్తారు. ఈ పండుగ సందర్భంగా తల్లులు తమ బిడ్డలు, కుటుంబ ఆరోగ్యం కోసం ఉపవాసం ఉండి శీతల దేవిని పూజిస్తారు. చాలా మంది తల్లులు తమ పిల్లల ఆరోగ్యం కోసం ఉపవాసం ఉండి శీతల మాతను పూజిస్తారు. దుర్గా మాతను శీతల దేవి రూపంలో అలంకరించి.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ నాడు ఉపవాసం ఉండి.. అమ్మవారిని పూజించడం వల్ల అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని భక్తులు నమ్ముతారు. శీతల సప్తమి నాడు అమ్మవారి కోసం ఉపవాసం ఉండటం వల్ల.. తమ పిల్లలను రోగాల బారిన పడకుండా శీతల దేవి కాపాడుతుందని.. వారికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. దాదాపు దేశమంతా వేర్వేరు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో బసోడా పేరుతో శీతల సప్తమి పండుగ చేసుకుంటారు.
ఇక ఈ సంవత్సరం శీతల సప్తమి పండుగ మంగళవారం, 10 మార్చి 2026న జరుపుకుంటారు.
- సప్తమి తిథి ప్రారంభం: 09 మార్చి 2026 రాత్రి 11:27 గంటలకు ప్రారంభం అవుతుంది.
- సప్తమి తిథి ముగింపు: 11 మార్చి 2026 రాత్రి 01:54 గంటల వరకు ఉంటుంది.
కుడుములు నైవేద్యంగా సమర్పిస్తే..
శీతల సప్తమి సందర్భంగా అమ్మవారికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. నేడు కుడుములు చేసి అమ్మవారి ముందు ఉంచి.. వాటిని శీతల అష్టమి నాడు అనగా రేపు (మార్చి 11) పిల్లల మీదుగా తిప్పి.. ఆ తర్వాత వాటిని కుక్కలకు వేస్తారు. ఇలా చేస్తే తమ పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని నమ్మకం. అమ్మవారి ఆశీర్వాదాలు పొందడానికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. శీతల మాత.. మశూచీ, అమ్మవారు వంటి మహమ్మారుల నుంచి రక్షిస్తుందని భక్తులు భావిస్తారు.
శీతల మాత ప్రస్తావన స్కంద పురాణంలో ఉంది. దుర్గా దేవి అంశ అయిన శీతల మాత గాడిదపై ఆసీనురాలై ఉంటారు. అమ్మవారి ఒక చేతిలో కలశం, మరో చేతిలో చీపురు ఉంటాయి. ఈ చీపురు పరిశుభ్రతకు ప్రతీకగా నమ్ముతారు. ఇక శీతల సప్తమి పండుగ సందర్భంగా భక్తులు ఇంట్లో స్వయంగా తయారు చేసిన తీపి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేస్తే మహమ్మారులు తమ పిల్లల దరి చేరవని నమ్ముతారు. పైగా ఈ కాలంలో వచ్చే అమ్మవారు, కంటి వ్యాధుల నుంచి అమ్మవారు తమ పిల్లలను కాపాడుతుందని నమ్ముతారు. నేడు దక్షిణ భారతంలో పోలేరమ్మ, మారెమ్మ వంటి గ్రామ దేవతలను పూజిస్తారు.
పూజ విధానం:
శీతల సప్తమి సందర్భంగా.. భక్తులు తెల్లవారుజామునే నిద్ర లేచి.. తలస్నానం చేసి.. తమ ఇల్లు, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేసుకుంటారు. ఆ తర్వాత పూజా స్థలాన్ని కూడా శుభ్రం చేసి.. శీతల దేవి విగ్రహం లేదా పటాన్ని ఏర్పాటు చేసి పూలతో అలంకరిస్తారు. పూలు, పండ్లు, సంప్రదాయ వంటకాలను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి పూజ ప్రారంభిస్తారు. తమ కుటుంబాన్ని కాపాడమని కోరుకుంటారు.
