Varalakshmi Vratham : నేడు వరలక్ష్మీ వ్రతం.. అమ్మవారికి పెట్టిన చీర, బ్లౌజ్‌పీస్ ఏం చేయాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఐదు రకాల నైవేద్యాలు ఇవే..
Varalakshmi Vratham 2026 : వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే వలక్ష్మీ దేవి ఏడాదంతా వరాల జల్లు కురిపిస్తుందని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు.
- Harish Thanniru
- Updated on- August 21, 2026 / 07:03 AM IST
Varalakshmi Vratham 2026
Varalakshmi Vratham 2026 : శ్రావణ మాసం వ్రతాలకు నోములకు ప్రసిద్ధి.. ఈ మాసంలో పార్వతిని మంగళగౌరిగా మంగళవారం, మహాలక్ష్మిని శ్రీవరలక్ష్మిగా శుక్రవారం, శనివారం వేంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామిలను పూజిస్తారు. అయితే, సౌభాగ్యం, సంపదలు, కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో ప్రధానమైనది శ్రీవరలక్ష్మీ వ్రతం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీంతో ఇవాళ (ఆగస్టు 21) వరలక్ష్మీ వత్రాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించుకొనేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సిద్ధమయ్యారు.
అన్నంతో కూడిన ఐదు రకాల నైవేద్యం..
వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే వలక్ష్మీ దేవి ఏడాదంతా వరాల జల్లు కురిపిస్తుందని పౌరాణిక గ్రంథాలలో చెప్పారు. ముఖ్యంగా ఐదు రకాలైనటువంటి అన్నంతో .. దద్దోజనం, పాయసాన్నం, పులిహోర, పులగం, గుడాన్నం (బెల్లం కలిపిన అన్నం) చేసిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలని పండితులు చెబుతున్నారు.
ఏ సమయంలో పూజలు చేయాలి..
మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు, తమ కుటుంబం సౌభాగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యం కోసం వరలక్ష్మీ వత్రాన్ని ఆచరిస్తారు. ఇవాళ పూజ చేసుకునేందుకు ఉదయం 06:15 నుంచి 08:20 గంటల వరకు (సింహ లగ్నం). ఇది కలశ స్థాపనకు, తొలి పూజకు అత్యంత అనుకూలమైన సమయం. అదేవిధంగా.. మధ్యాహ్నం 12.45 గంటల నుంచి 3గంటల వరకు (వృశ్చిక లగ్నం) ఉదయం పూజ చేసుకోలేనివారు ఈ సమయాల్లో పూజ చేసుకోవచ్చు. సాయంత్రం 6.45గంటల నుంచి రాత్రి 8.20 గంటల (కుంభ లగ్నం) వరకు. ప్రదోషకాలంలో దీపారాధన, అర్చనకు శ్రేయస్కరం. అయితే, ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు రాహుకాలం, అలాగే మధ్యాహ్నం 3గంటల నుంచి 4.30 గంటల వరకు యమగండం ఉన్నందున ఈ సమయాల్లో కొత్తగా పూజ ప్రారంభించకూడదని చెబుతున్నారు.
అమ్మవారికి పెట్టిన చీర, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి..
వరలక్ష్మీ వ్రతం పూజ సమయంలో అమ్మవారికి చీర లేదంటే బ్లౌజ్ ఉంచుతారు. అయితే, వరలక్ష్మీ వ్రతం తరువాత చాలామంది మహిళలు అమ్మవారికి అలంకరించిన చీర, బ్లౌజ్ పీస్ ను తాము ఉపయోగించుకోవాలనుకుంటారు. కానీ, అది సరికాదని పండితులు చెబుతున్నారు. మరుసటి రోజు మమాలక్ష్మిని పూజించి, కదిలించాక ఆ రెండింటినీ ఎవరైనా సుహాసిని స్త్రీలు లేదంటే వ్రతాన్ని చేయించినవారికి బహుమానంగా ఇస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే, లక్ష్మీదేవి అనుగ్రహం జీవిత పర్యంతమూ ఉండాలి కాబట్టి, ఈ వత్రానికి ఉద్యాపన ఉండదంటున్నారు.
ఈ పనులు అస్సలు చేయొద్దు..
వరలక్ష్మీ వ్రతం పూజలో పాల్గొనేవారు.. ఆ ఇండ్లలోని వ్యక్తులు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి.. ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటివి తీసుకోకూడదు. బ్రహ్మాచర్యం పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్రమత్తుగా, బద్దకంగా, ఆవళింపులతో ఉండకూడదు. చెత్తను బయట పడేయకూడదు. చీపురతో ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం చేయొద్దు. ఇతరులతో గొడవ పడటం, కఠినంగా మాట్లాడటం, చిరాకుగా ఉండటం చేయకూడదు. ధనాన్ని అప్పుగా ఇవ్వండ లేదంటే తీసుకోవటం చేయొద్దు. వెంట్రుకలు కత్తిరించడం, గోర్లు తీయడం చేయొద్దు. ఇలా చేయండం అపశకునంగా భావిస్తారు. పూజకోసం తులసీ దళాలను తెంపకూడదు. జుట్టును విరబూసుకొని ఉండొద్దు. ఇంట్లో దుర్గధం లేకుండా సాంబ్రాణి లేక అగరవత్తుల పొగ చేసి శుద్ది చేయాలి. గృహిణులైతే తప్పక చీర కట్టుకోవాలి. పెళ్లి కాని ఆడపిల్లలైతే సంప్రదాయ బట్టలు వేసుకోవాలి. గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచిపెట్టకూడదు.
