×
Ad

రూ.1,77,50,21,00,000కు ఆర్సీబీని ఆయన కొంటున్నారా? కళ్లుచెదిరే డీల్.. చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం

ఆర్సీబీ 2025 ఐపీఎల్ గెలిచిన తర్వాత బ్రాండ్ విలువ పెరిగింది. తాజా ఐపీఎల్ విలువల అధ్యయనాల ప్రకారం ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది.

RCB

RCB: ఇండియన్ ప్రీమియర్ జట్టు ఆర్సీబీ 2025 సీజన్​లో ఛాంపియన్​గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ జట్టు అమ్మకానికి ఉందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా, దీనికి సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది.

సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ఓ ట్వీట్ చేసి ఆసక్తి రేపారు. “సరైన వాల్యేయేషన్‌ వద్ద ఉన్నాం.. ఆర్సీబీ గొప్ప జట్టు” అని అన్నారు. దీంతో ఆర్సీబీని కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో అదర్ పూనావాలా ముందంజలో ఉన్నారంటూ జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. ఆర్సీబీ ప్రస్తుత ఓనర్ డయాజియో అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్.

రూ.17 వేల కోట్లకు పైగా..

ఆర్సీబీని 2 బిలియన్ డాలర్ల (రూ.1,77,50,21,00,000) విలువకు కొనేవారి కోసం డయాజియో వేచి ఉందని తెలుస్తోంది. అంత భారీ విలువకు ఎవరైనా కొంటే క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన జట్టు ఆస్తులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ విక్రయ పర్యవేక్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సిటీని సలహాదారుగా నియమించారని సమాచారం.

$2 బిలియన్ సాధ్యమేనా?
ఆర్సీబీ 2025 ఐపీఎల్ గెలిచిన తర్వాత బ్రాండ్ విలువ పెరిగింది. తాజా ఐపీఎల్ విలువల అధ్యయనాల ప్రకారం ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది. దీంతో భారీ ధర చెల్లించడానికి కొనుగోలుదారులు ఆసక్తిచూపే అవకాశం ఉంది. ఈ విక్రయం పూర్తయితే, లక్నో సూపర్ జెయింట్స్ విక్రయ ధర కంటే ఆర్సీబీ ధర రెండింతల కంటే ఎక్కువ అవుతుంది. లక్నో జట్టును ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ రూ.7,090 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

అదర్ పూనావాల్లా ఎక్స్‌లో చేసింది చిన్న ట్వీటే అయినప్పటికీ సరైన సమయంలో ఆయన నుంచి ఈ స్పందన వచ్చింది. మాజీ ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోదీ ఆర్సీబీ ప్రధాన పెట్టుబడి అవకాశమని పబ్లిక్‌గా సూచనలు చేశారు. గ్లోబల్ ఫండ్స్ కూడా ఆసక్తి చూపుతాయని అన్నారు.

దీంతో ఆర్సీబీ అమ్మకం అంశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2008 ఐపీఎల్ వేలంలో విజయ్ మాల్యా యూబీ గ్రూప్ ఆర్సీబీని $111.6 మిలియన్లకు కొనుగోలు చేసింది. తర్వాతి దశాబ్దంలో లండన్‌లో లిస్ట్ అయిన స్పిరిట్స్ దిగ్గజం డయాజియో యునైటెడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ షేర్‌హోల్డర్ అయింది. 2014లో పూర్తి నియంత్రణ సంపాదించింది. దీంతో ఆర్సీబీ డయాజియో అధీనంలోకి వచ్చింది. ఇప్పుడు జరగబోయే విక్రయం యునైటెడ్ స్పిరిట్స్, డయాజియో కార్పొరేట్ ఛానెల్స్ ద్వారా జరుగుతుంది.

ఆర్సీబీకి ఇటీవల లభించిన ట్రోఫీతో పాటు ప్రపంచ వ్యాప్త మీడియా ప్రాపర్టీగా ఉంది. స్పాన్సర్‌షిప్, మెర్చండైజింగ్, మీడియా హక్కుల ద్వారా భారీ వృద్ధి ఉంది. ఐపీఎల్ విలువలు వీటిపైనే ఆధారపడి ఉంటాయి.

ఐపీఎల్ జట్టు కొనుగోలు ఇప్పుడు కార్పొరేట్ ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక ఆడ్వాంటేజ్‌గా మారింది. పూనావాలా కూడా ఈ జాబితాలో చేరతారు. ఈ డీల్ డయాజియో అనుమతులు, భారత నియంత్రణ నిబంధనలు, బీసీసీఐ/ఐపీఎల్ యాజమాన్య నియమాలకు అనుగుణంగా జరగాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆర్సీబీ కొనుగోలుపై డయాజియో/యునైటెడ్ స్పిరిట్స్, పూనావాలా నుంచి అధికారికగా ఎటువంటి ధ్రువీకరణా రాలేదు.