Asian Games 2026 : అదరగొట్టిన అంకుశ్ పంఘల్.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి బాక్సింగ్ పతకం
Asian Games 2026 : ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ అంకుశ్ పంఘల్ అదరగొట్టాడు. పురుషుల 80 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో విజేతగా నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
- Harish Thanniru
- Published on- September 27, 2026 / 12:50 PM IST
Indian Boxer Ankush Panghal
Asian Games 2026 : ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ అంకుశ్ పంఘల్ అదరగొట్టాడు. ఆదివారం ఉదయం జరిగిన పురుషుల 80 కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో తజికిస్థాన్‌కు చెందిన నెక్రూజ్ సలిమోవ్‌పై 5-0తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. దీంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి పతకం ఖరారైంది.
కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ అయిన అంకుశ్.. పోరులో తొలి రెండు రౌండ్లలో పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించాడు. వేగవంతమైన పంచ్‌లు, ఖచ్చితమైన కాంబినేషన్లు, మెరుగైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. తద్వారా తొలి రౌండ్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అదేవిధంగా రెండో రౌండ్‌లోనూ అంకుశ్ తన హవా కొనసాగించాడు. మూడో రౌండ్‌లో సలిమోవ్ ఎదురుదాడికి దిగాడు. కొన్ని పంచ్‌లు సంధిస్తూ రౌండ్‌లో పైచేయి సాధించినప్పటికీ.. అప్పటికే అంకుశ్‌కు వచ్చిన ఆధిక్యాన్ని అధిగమించలేకపోయాడు. దీంతో చివరికి 5-0 తేడాతో అంకుశ్ విజయం సాధించాడు. భారత్‌కు తొలి బాక్సింగ్ పతకం ఖాయం కావడంతో అంకుశ్ పంఘల్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గత నెల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అంకుశ్ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తాజా విజయంతో అతడు కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అంతేకాదు, 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి పతకాన్ని అందించిన బాక్సర్‌గా నిలిచాడు.
సెమీఫైనల్లో అంకుశ్‌కు మరింత కఠినమైన పోటీ ఎదురుకానుంది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఫజ్లిద్దీన్ ఎర్కిన్‌బోయెవ్‌తో సెప్టెంబర్ 29న తలపడనున్నాడు. ఎర్కిన్‌బోయెవ్ ప్రస్తుతం 75 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా ఉన్నాడు.
