Arjun Tendulkar : దమ్మురేపిన సచిన్ టెండూల్కర్ కొడుకు.. అన్నీ మెరుపులే..
టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Published On : January 13, 2024 / 06:28 PM IST
Arjun Tendulkar good with bat slams fifty against Chandigarh
Arjun Tendulkar – Sachin Tendulkar : టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తండ్రి బాటలో పయనించేందుకు చాలా కష్టపడుతున్నాడు. అయితే.. అతడిపై ఉన్న అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. పేస్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ రంజీట్రోఫీలో బ్యాట్‌తో చెలరేగిపోయాడు. గోవా తరుపున ఆడుతున్న అర్జున్ చండీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. గోవా భారీ స్కోర్ చేయడంలో తన వంతు సాయం చేశాడు.
ఈ మ్యాచ్‌లో గోవా తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 160 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 618 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సుయాశ్ ప్రభుదేశాయ్ (197) తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. దీప్‌రాజ్ గోయంకర్ (115 నాటౌట్) సెంచరీ బాదాడు. అర్జున్ టెండూల్కర్‌తో పాటు కృష్ణ మూర్తి సిద్ధార్ధ్ (77) అర్ధశతకం చేశాడు. ఛండీఘర్ బౌలర్లలో జగిత్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. రాజ్ బవా, అర్పిత్ పన్ను, అర్స్‌లన్ ఖాన్, కునాల్ మహజన్ తలా ఓ వికెట్ సాధించారు.
ఆర్‌సీబీ అభిమానులు ఖుషీ..
సుయాశ్ ప్రభుదేశాయ్ తృటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అతడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. ఎందుకంటే ఐపీఎల్‌లో అతడు ఆర్‌సీబీ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అతడు మంచి ఫామ్‌లో ఉండడంతో ఈ సారి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని అంటున్నారు.
