Arshdeep Singh : టీ20ల్లో 250వ వికెట్.. క్రిస్టియానో రొనాల్డో స్టైల్‌లో అర్ష్‌దీప్ సింగ్ ‘సుయ్’ సెలబ్రేషన్స్..
టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- February 13, 2026 / 12:30 PM IST
Arshdeep Singh Cristiano Ronaldo Iconic Siu Celebration video viral
- టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత
- 250 మైలురాయి
- క్రిస్టియానో రొనాల్డో స్టైల్‌లో సెలబ్రేషన్స్
Arshdeep Singh : టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో (అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్) 250 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జాన్ ఫ్రైలింక్‌ను ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ సింగ్ ఈ ఘనత సాధించాడు. అర్ష్‌దీప్ కేవలం 188 మ్యాచ్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.
కాగా.. ఈ మైలురాయిని చేరుకున్న తరువాత ఈ ఎడమచేతి వాటం పేసర్ ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో లాగా రెండు చేతులు వెనక్కి పెట్టి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీన్నే సుయ్ సెలబ్రేషన్స్ అని అంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61 పరుగులు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52 పరుగులు) మెరుపు అర్థశతకాలు సాధించారు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు తీశాడు.
ఆ తరువాత 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్‌దూబె, బుమ్రాలు తలా ఓ వికెట్ సాధించారు.
