Asian Games 2026 : చివరి నిమిషంలో జోడీ మార్పు.. ఆసియా క్రీడ‌ల్లో భారత్‌కు రెండో గోల్డ్ మెడ‌ల్‌.. ఈ సారి షూటింగ్‌లో..

ఆసియా క్రీడ‌లు 2026లో (Asian Games 2026 )భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం ల‌భించింది.

Asian Games 2026 Kamaljeet and Suruchi win Indias 1st shooting Gold

Asian Games 2026 : ఆసియా క్రీడ‌లు 2026లో భార‌త్‌కు మ‌రో స్వ‌ర్ణం ల‌భించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. దీంతో ఈ ఆసియాక్రీడ‌ల్లో భార‌త స్వ‌ర్ణ ప‌త‌కాల సంఖ్య రెండుకు చేరింది. అంత‌క ముందు మ‌హిళ‌ల క్రికెట్‌లో మ‌న జ‌ట్టు గోల్డ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

చివరి నిమిషంలో జోడీ మార్పు..

షూటింగ్ విభాగంలో మ‌ను బాక‌ర్ వంటి స్టార్ షూట‌ర్లు నిరాశ‌ప‌రిచారు. దీంతో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పతకం సాధించేందుకు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ చివరి అవకాశంగా మారింది. ఈ క్ర‌మంలో ఈ ఈవెంట్‌కు ముందు నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా ఓ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం తీసుకుంది. సుర‌చితో జ‌త‌క‌ట్టిన పురుష షూటర్‌ను మార్చింది.

మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌కు తొలుత సురుచి సింగ్‌తో కలిసి కేదార్లింగ్ బాలకృష్ణ ఉచగన్వేను ఎంపిక చేశారు. అయితే గురువారం జరిగిన పురుషుల క్వాలిఫికేషన్‌లో కమల్‌జీత్ 580 పాయింట్లతో భారత షూటర్లలో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతను తొమ్మిదో స్థానంలో నిలిచి వ్యక్తిగత ఫైనల్‌కు ఒక్క పాయింట్ తేడాతో దూరమయ్యాడు.

మరోవైపు కేదార్లింగ్ క్వాలిఫికేష‌న్‌లో 568 పాయింట్లతో 35వ స్థానంలో నిలిచాడు. దీంతో క‌మ‌ల్‌జీత్‌ను మిక్స్‌డ్ టీమ్‌లోకి తీసుకోవాల‌ని నేష‌న‌ల్ రైఫిల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా నిర్ణ‌యించింది. ఈ నిర్ణయం భారత్‌కు కలిసొచ్చింది.

క్వాలిఫికేషన్‌లోనూ అదరగొట్టిన జోడీ..

సురుచి, కమల్‌జీత్ జోడీ క్వాలిఫికేషన్‌లో 587 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇందులో 29 ఇన్నర్-10లు సాధించారు. ఫైనల్‌లోనూ భారత జోడీ అదే జోరును కొనసాగించింది. 484.6 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన సుహ్యోన్ హాంగ్, గేయున్ చూ 478.0 పాయింట్లతో రజతం గెలుచుకోగా, ఇరాన్ 415.8 పాయింట్లతో కాంస్య పతకం సాధించింది.

దక్షిణ కొరియాపై భారత్ ఏకంగా 6.6 పాయింట్ల ఆధిక్యంతో స్వర్ణం సాధించడం విశేషం. ప్రపంచ రికార్డుకు భారత్ కేవలం 3.8 పాయింట్ల దూరంలో నిలిచింది.

ఒక్కరోజు ముందు వ్యక్తిగత ఈవెంట్లలో నిరాశకు గురైన సురుచి, కమల్‌జీత్.. అనూహ్యంగా జోడీగా బరిలోకి దిగి తమ అత్యుత్తమ ప్రదర్శన చేశారు. కమల్‌జీత్ పురుషుల వ్యక్తిగత ఫైనల్‌కు ఒక్క పాయింట్ తేడాతో దూరం కాగా, సురుచి మహిళల క్వాలిఫికేషన్‌లో 26వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. అయితే మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఇద్దరూ అద్భుతంగా రాణించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. దీంతో ఆసియా క్రీడల ఆరో రోజున‌ షూటింగ్‌లో భారత్ స్వర్ణ పతక ఎదురుచూపుల‌కు తెర‌ప‌డింది.