×
Ad

AUS vs ENG : 5468 రోజుల త‌రువాత ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇంగ్లాండ్‌.. వామ్మో 15 ఏళ్లు పట్టిందా ఈ గెలుపు కోసం..

యాషెస్ సిరీస్‌లో ఎట్ట‌కేల‌కు (AUS vs ENG ) ఇంగ్లాండ్ విజ‌యాన్ని రుచి చూసింది.

AUS vs ENG 4th Test England won their first Test on Australian soil in 15 years

AUS vs ENG : యాషెస్ సిరీస్‌లో ఎట్ట‌కేల‌కు ఇంగ్లాండ్ విజ‌యాన్ని రుచి చూసింది. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్ (బాక్సింగ్ డే) లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. త‌ద్వారా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని కాస్త త‌గ్గించింది. ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. కాగా.. ఆస్ట్రేలియా గ‌డ్డ మీద 5468 రోజులు అంటే దాదాపు 15 సంవ‌త్స‌రాల త‌రువాత ఇంగ్లాండ్ ఓ టెస్టు మ్యాచ్‌లో గెల‌వ‌డం గ‌మ‌నార్హం.

175 ప‌రుగుల ల‌క్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 32.2 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో జాక్ క్రాలీ (37), బెన్ డ‌కెట్ (34), జాక‌బ్ బెథెల్ (40)లు రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్‌, జై రిచర్డ్సన్, స్కాట్ బొలాండ్‌లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ మరో మ్యాచ్ ఆడబోతున్నారా..? అసలు వాస్తవం ఏమిటంటే..

అంత‌క ముందు ఓవర్‌నైట్‌ స్కోర్ 4/0తో రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన ఆస్ట్రేలియా 34.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 ప‌రుగులు క‌లుపుకుని ఇంగ్లాండ్‌కు 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్‌ హెడ్‌ (46), స్టీవ్ స్మిత్ (24) లు రాణించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోష్‌ టంగ్‌, బెన్‌స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీశాడు. గస్‌ అట్కిన్సన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 152, ఇంగ్లాండ్‌ మొద‌టి ఇన్నింగ్స్‌లో 110 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే.

మ్యాచ్ సంక్షిప్త స్కోర్లు..

* ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ – 152 ఆలౌట్‌
* ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ – 110 ఆలౌట్‌
* ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ – 132 ఆలౌట్‌
* ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 178/6

చాలా ఏళ్ల త‌రువాత ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇంగ్లాండ్ ఓ టెస్టు మ్యాచ్ గెల‌వ‌డంతో అభిమానుల సంబ‌రాలు అంబ‌రాన్ని అంటాయి.