IND vs AUS : వరుస ఓటముల ఎఫెక్ట్..! సిరీస్ మధ్యలో ఆరుగురు ఆటగాళ్లను మార్చిన ఆస్ట్రేలియా
India vs Australia : భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 28, 2023 / 04:00 PM IST
IND vs AUS
భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చింది. వెంటనే వీళ్లను స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లు అయిన స్టీవ్‌స్మిత్, ఆడమ్ జంపాలు ఇప్పటికే స్వదేశానికి బయలుదేరారు. గౌహతి వేదికగా మంగళవారం జరగనున్న మూడో మ్యాచ్ అనంతరం గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్, సీన్ అబాట్‌లు సైతం స్వదేశానికి వెళ్లనున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023 ఆడిన జట్టులో ట్రావిస్ హెడ్ మాత్రమే టీ20 సిరీస్ మొత్తం కొనసాగనున్నాడు. ఈసిరీస్‌లో మొదటి రెండు మ్యాచులకు ఆసీస్ మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బెన్ మెక్‌డెర్మోట్, జోస్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్ లు జట్టులోకి వచ్చారు.
వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన నాలుగు రోజులకే టీ20 సిరీస్ ఆరంభమైంది. ప్రపంచకప్‌లో ఆడిన ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, హేజిల్ వుడ్ లకు విశ్రాంతి ఇవ్వగా.. స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్వెల్ వంటి ఆటగాళ్లను మాత్రం టీ20 సిరీస్‌కు ఎంపికైయ్యారు. బీజీ షెడ్యూల్ ముందు ఉన్న నేపథ్యంలో వీళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలని ఆసీస్ మేనేజ్మెంట్ భావించింది. ఈ క్రమంలోనే సిరీస్ మధ్యలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మిగిలిన 3 టీ20ల కోసం ప్రకటించిన ఆసీస్ జట్టు ఇదే..
మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్డోర్మోట్, జోష్ ఫిలిప్స్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్సన్.
