Site icon 10TV Telugu

Pat Cummins : ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు.. స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటన తరువాత.. పాట్ కమిన్స్ కీలక నిర్ణయం..

Pat Cummins

Pat Cummins

Pat Cummins : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఒకేరోజు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే టెస్టు జట్టు కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కీలక ప్లేయర్ అయిన పాట్ కమిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Also Read: Mitchell Starc : ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం.. టీ20 ఫార్మాట్‌‌కు గుడ్‌బై.. కారణం ఇదేనట..

ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెలలో తొలుత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్టోబర్ నెల మొదటివారంలో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు టీ20లు ఆడుతుంది. ఆ తరువాత అదే నెల 19 నుంచి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. నవంబర్ 21 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్‌ జట్టుతో ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే, పాట్ కమిన్స్ న్యూజిలాండ్, భారత జట్టుతో జరిగే సిరీస్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ప్రకటన చేసింది.

కమిన్స్‌కు వెన్నెముక కింద భాగంలో సమస్య ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ కారణంగానే అతను న్యూజిలాండ్, భారత్ జట్లతో జరిగే సిరీస్‌లకు దూరమైనట్లు పేర్కొంది. కమిన్స్ తిరిగి నవంబర్ 21 నుంచి జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో పాల్గొంటారు. అప్పటి వరకు దేశవాలీ టోర్నీల్లోనూ పాల్గొనడని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది.

ఇంగ్లాండ్, కరేబియన్ దీవుల్లో జరిగిన నాలుగు టెస్టుల్లో 95ఓవర్లకు పైగా బౌలింగ్ చేసిన కమిన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. పనిభారం ఎక్కువ కావడంతో అతను అనారోగ్య సమస్యకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్ ను దృష్టిలో ఉంచుకొని కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విశ్రాంతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా కీలక బౌలర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది గంటలకే పాట్ కమిన్స్ వచ్చే రెండు సిరీస్‌లకు అందుబాటులో ఉండడని ఆస్ట్రేలియా తెలిపింది. వీరిద్దరూ ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన బౌలర్లు. దీంతో ఇద్దరూ తుది జట్టులో లేకపోవటం ఆ జట్టు బౌలింగ్ విభాగానికి ఇబ్బందికరమైన విషయమనే చెప్పొచ్చు.

 

Exit mobile version