Saina Nehwal Parupalli Kashyap
Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆదివారం రాత్రి వెల్లడించారు. ఎంతో ఆలోచించి, చర్చించిన తరువాత తాను, కశ్యప్ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సైనా తెలిపింది.
సైనా, కశ్యప్ ఇద్దరూ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో 2018లో వారు వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఏడేళ్ల తరువాత వారు తమ వివాహ బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో విడాకులు తీసుకుంటున్నామని చెప్పారు.
‘జీవితం కొన్నిసార్లు మనల్ని వేర్వేరు మార్గాల్లోకి తీసుకెళ్తుంది. చాలా ఆలోచన, చర్చల తరువాత కశ్యప్ పారుపల్లి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా శాంతి, ఎదుగుదల, స్వస్థతను ఎంచుకుంటున్నాం. కశ్చప్ తో నాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. ఇకపై మిత్రులుగా ఉంటాం. మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని, ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.
Saina Nehwal says on Instagram she is parting ways with Parupalli Kashyap. pic.twitter.com/WK1wlDCzxP
— Vinayakk (@vinayakkm) July 13, 2025
సైనా నెహ్వాల్ రెండు సార్లు కామన్వెల్త్ ఛాంపియన్ గా నిలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. 2015లో మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించారు. దీంతో ఆ ర్యాంక్ సాధించిన తొలి మహిళగా నిలిచారు. సైనా తన కెరీర్ లో కామన్వెల్త్ క్రీడల్లో మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. వాటిలో రెండు మహిళల సింగిల్స్ లో, ఒకటి మిక్స్‌డ్ డబుల్స్‌లో వచ్చాయి. సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడారు.
పారుపల్లి కశ్యప్ 2014లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించారు. 2013లో తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంకింగ్ ను సాధించి ఆరో స్థానానికి చేరుకున్నాడు. 2024లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన .. కోచింగ్ ప్రారంభించారు.