India Women
Bangladesh Women vs India Women : బంగ్లాదేశ్ పర్యటనలో భారత మహిళలు(India Women) అదరగొడుతున్నారు. మంగళవారం షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో మూడు మ్యాచుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో టీమ్ఇండియా కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్‌లో షఫాలీ వర్మ (Shafali Verma) మూడు వికెట్లు తీయడంతో పాటు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇవ్వడంతో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో భారత్ 8 పరుగుల తేడాతో బంగ్లా పై గెలిచింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 95 పరుగులే చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో 19 పరుగులు చేసిన షఫాలీ వర్మ టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమన్‌జ్యోత్ కౌర్ (14), స్మృతి మంధాన (13), యస్తికా భాటియా (11), దీప్తి శర్మ (10) లు రెండు అంకెల స్కోరు చేశారు. మొదటి టీ20లో హాఫ్ సెంచరీ చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో డకౌటైంది. రోడిక్స్ 8 పరుగులకే చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తానా మూడు వికెట్లు తీయగా ఫాహిమా రెండు వికెట్లు పడగొట్టింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని సైతం బంగ్లాదేశ్ ఛేదించలేకపోయింది. బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో భారత్ సత్తా చాటింది. దీంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా ఒక్కతే 38 పరుగులతో రాణించగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. బంగ్లా బ్యాటర్లలో ముగ్గురు డకౌట్లు అయ్యారు. ఆఖరి ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. షఫాలీ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేసింది.
మూడు వికెట్లు తీసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చింది. ఓ రనౌట్‌తో కలుపుకుంటే ఆఖరి ఓవర్‌లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, షఫాలీ వర్మ లు చెరో మూడు వికెట్లు తీయగా మిన్ను మణి రెండు వికెట్లు పడగొట్టింది. నామమాత్రమైన మూడో టీ20 జులై 13న జరగనుంది.
MS Dhoni : సీఎస్‌కేలో చోటు కోరిన కమెడియన్.. ధోని రియాక్షన్ వైరల్