Rohit Sharma : మీటింగ్‌కు రాని అజిత్ అగార్కర్.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక వ్యాఖ్యలు..
రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక వ్యాఖ్యలు చేశారు.
- Thota Vamshi Kumar
- Updated on- September 3, 2026 / 08:55 PM IST
BCCI Clear Mandate On Rohit Sharma And His Future
Rohit Sharma : ముంబైలోని తమ ప్రధాన కార్యాలయంలో గురువారం బీసీసీఐ నిర్వహించిన సమీక్షా సమావేశం ముగిసింది. భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ సమావేశానికి హాజరు అయ్యారు.
వీరితో పాటు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవాజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) హేమాంగ్ అమిన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం గైర్హాజరు అయ్యారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో భారత్ ఘోర ఓటములు, వన్డే ప్రపంచకప్ 2027 వ్యూహాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది.
కాగా.. ఈ సమావేశంలో రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి చర్చ జరగనుందని, అతడు ఇక రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు సమావేశానికి ముందు షికార్లు చేశాయి. మీటింగ్ అనంతరం వీటి అన్నింటిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అతడు చివరిగా ఆడిన మ్యాచ్.. లార్డ్స్ వన్డేలో 138-148 పరుగులు చేశాడని, ఇంత బాగా ఆడుతున్నప్పుడు ఊహాగానాలు ఎందుకు? అని ప్రశ్నించారు. తాను వదంతులు వ్యాప్తి చేసే వారికి ఊతం ఇవ్వాలని అనుకోవడం లేదన్నాడు.
అయితే.. వన్డే ప్రపంచకప్ 2027లో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడతాడు అనే భరోసాను మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబైకి దూరంగా ఉండటం, ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల, కనెక్టివిటీ పరిమితుల కారణంగా ముఖ్యమైన సమావేశానికి హాజరు కాలేకపోయారని తెలిపాడు.
‘ఈరోజు మేము ఎలాంటి సెలక్షన్ మీటింగ్ నిర్వహించలేదు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి నిర్వహించే విధంగానే, మేము ఒక సాధారణ సమావేశం నిర్వహించాము. ఈరోజు మేము హెడ్ కోచ్, సీఓఈ హెడ్ ఆఫ్ క్రికెట్‌తో పాటు, ఇద్దరు కెప్టెన్లు, టీ20ఐ కెప్టెన్ శ్రేయస్, టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్‌లతో సమావేశమయ్యాం. ఈరోజు ఆయన (అగార్కర్) అందుబాటులో లేకపోవడంతో పాల్గొనలేకపోయాడు. ఈ సమావేశాన్ని చాలా హఠాత్తుగా ఏర్పాటు చేశాము. ముందుగా అగార్కర్‌కు సమాచారం అందించలేకపోయాం. ‘అని సైకియా చెప్పుకొచ్చాడు.
అగార్కర్ పదవీకాలం ముగియనుందన్న వదంతులు, సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో మార్పులు, పురుషుల క్రికెట్ విభాగానికి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ నియామకం వంటి అంశాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ‘ఈరోజు సమావేశంలో దీనిపై అలాంటి చర్చ ఏదీ జరగలేదు. నేను కొత్త వదంతులపై వ్యాఖ్యానించను. మేము అలాంటి చర్చలు ఏవీ జరపలేదు, అలాగే మాకు అలాంటి ఉద్దేశాలు కూడా లేవు.’ అని సైకియా తెలిపాడు.
‘ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లలో ప్రదర్శనలపైనా, అలాగే ఇటీవల శ్రీలంకలో జరిగిన టెస్ట్ సిరీస్‌పైనా, ఇంకా మా అంతిమ లక్ష్యమైన వన్డే ప్రపంచకప్‌కు ముందు జరగబోయే సిరీస్‌లో ఏం చేయబోతున్నామనే దానిపైనా చర్చ జరిగింది. మాకు ముందు ముందు బిజీ షెడ్యూల్ ఉన్నందున, జట్టు సన్నాహాలకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణపై ప్రాథమికంగా చర్చించుకున్నాము. ‘అని సైకియా అన్నారు.
