Kohli Vs Gambhir: బీసీసీఐ సీరియస్.. కోహ్లీ, గంభీర్‌కు భారీ జరిమానా.. ఇన్‌స్టా‌గ్రామ్‌ స్టోరీలో ఆసక్తికర కొటేషన్ పోస్టు చేసిన కోహ్లీ..

వరుస వాగ్వాదాలు, బీసీసీఐ భారీగా ఫైన్ విధించిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్టు పెట్టాడు.

Kohli Vs Gambhir: ఐపీఎల్ 2023 సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నువ్వానేనా అన్నట్లుగా పలు జట్ల ఆటగాళ్లు వాగ్వాదాలకుసైతం దిగుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు (RCB), లక్నో (LSG) జట్ల మధ్య మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ గుర్తుకొస్తారు. గత నెల 10న జరిగన మ్యాచ్ లో లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్, బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో సోమవారం రాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మరికొన్ని వివాదాలకు కారణమైంది. కోహ్లీ వర్సెస్ లక్నో జట్టు అన్నట్లు మ్యాచ్ మారిపోయింది. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రాతో కోహ్లీ గొడవకు దిగారు. మ్యాచ్ అనంతరం గంభీర్, కోహ్లీ మధ్య మైదానంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది.

Virat Kohli vs Naveen Ul Haq

సోమవారం రాత్రి బెంగళూరు, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత నెల ఇరు జట్ల మధ్య మ్యాచ్ లో లక్నో విజయం సాధించిన విషయం విధితమే. ఈక్రమంలో గంభీర్ మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా సంజ్ఞ చేశాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో లక్నో ఆటగాడు కృనాల్ క్యాచ్ అందుకున్న కోహ్లీ.. గంభీర్ లా చేయకూడదని సూచిస్తూ ముద్దు పెడుతున్నట్లు సంజ్ఞ చేశాడు. అంతేకాక వికెట్ పడ్డ ప్రతీసారి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో లక్నో బౌలర్ నవీన్ ఉల్ హుక్, బ్యాటర్ అమిత్ మిశ్రాతో కోహ్లీకి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ, గంభీర్ ల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగింది. ఇద్దరు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లడంతో ఆయా జట్ల సభ్యులు వారిని పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో లు వైరల్ గా మారాయి.

Kohli Vs Gambhir

వాగ్వాదం అనంతరం లక్నో కెప్టెన్ రాహుల్ తో కోహ్లీ మాట్లాడుతూ.. జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ ను రాహుల్ పిలిచి కోహ్లీకి స్వారీ చెప్పాలని సూచించగా.. నేనెందుకు క్షమాపణలు చెప్పాలి అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, వరుస ఘటనల నేపథ్యంలో  కోహ్లీ, గంభీర్‌కు భారీ జరిమాను బీసీసీఐ విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు‌గాను కోహ్లీ, గంభీర్‌ల మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధించింది. అదేవిధంగా లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ మ్యాచ్ ఫీజులో 50శాతం కోత విధిస్తూ బీసీసీఐ ప్రకటించింది.

Virat Kohli Vs Amit Mishra

వరుస వాగ్వాదాల నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర పోస్టు పెట్టాడు. ‘మనం వినేదంతా అభిప్రాయం మాత్రమే.. వాస్తవం కాదు. మనం చూసేదంతా దృష్టికోణం మాత్రమే.. నిజం కాదు..’  అంటూ విరాట్ తన ఇన్‌స్టా  స్టోరీలో పేర్కొన్నారు.  గంభీర్‌తో వాగ్వాదం నేపథ్యంలో కోహ్లీ ఇలాంటి పోస్టు చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Virat’s Instagram story

 

ట్రెండింగ్ వార్తలు