#BorderGavaskarTrophy
BGT 2023: ఆస్ట్రేలియా భయపడినట్టుగానే జరిగింది. నాగపూర్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా చేతిలో కంగారూలకు భంగపాటు తప్పలేదు. పిచ్ పై సందేహాలు వ్యక్తం చేస్తూనే బరిలోకి దిగిన ఆసీస్ జట్టు భారీ పరాజయాన్ని చవిచూసింది. భారత స్పిన్నర్ల ధాటికి నిలబడలేక మూడు రోజులకే మ్యాచ్ ను అప్పగించేసింది. ఫలితంగా బోర్డర్ –గవాస్కర్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లో ఆసీస్ కు ఘోర ఓటమి ఎదురైంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలయింది.
శాసించిన స్పిన్నర్లు
తొలి టెస్టులో స్పిన్నర్లు ప్రతాపం చూపారు. ఆస్ట్రేలియా ఓడిపోవడానికి ప్రధాన కారణం స్పిన్నర్లు. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమ బౌలింగ్ తో ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. ముఖ్యంగా ఆట మూడో రోజు భీకరంగా చెలరేగారు. 32.3 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు మొత్తం ఆలౌట్ అయిందంటే స్పిన్నర్లు ఎంతెలా చెలరేగారో అర్థం అవుతుంది. మొత్తంగా చూస్తే ఇరు జట్ల స్పిన్నర్లు 24 వికెట్లు
పడగొట్టారు.
అశ్విన్, జడేజా పోటాపోటీ
భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా పోటాపోటీగా వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 5 వికెట్లు సాధిస్తే, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లు దక్కించుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిసి అశ్విన్ 8, జడేజా 7 వికెట్లు నేల కూల్చారు. ఈ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్లు ఓవరాల్ గా 16 వికెట్లు పడగొట్టారు. అక్సర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. సీమర్లు మహ్మద్ షమి 3 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
బ్యాటింగ్ లోనూ జోరు
టీమిండియా స్పిన్నర్లు బ్యాటింగ్ లోనూ సత్తా చాటారు. జడేజా (70), అక్సర్ పటేల్(84) అర్థ సెంచరీలతో రాణించారు. అశ్విన్ 23 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుత బ్యాటింగ్ (120) కు స్పిన్ మాయాజాలం తోడు కావడంతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్, బంతితో రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.