Hardik Pandya
IND VS NED : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడిన టీమ్ఇండియా 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టును ప్రస్తుతం ఒక్కటే సమస్య వేధిస్తోంది. అదే హార్దిక్ పాండ్య గాయం. అక్టోబర్ 19న పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమ చీలమండలానికి గాయమైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పాండ్య బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. అయితే.. పాండ్య తిరిగి మెగా టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయం పై అభిమానుల్లో సందేహం నెలకొంది. కాగా.. పాండ్య ఖచ్చితంగా ఈ మెగాటోర్నీలో ఆడతాడని, అయితే.. ఏ మ్యాచ్ ద్వారా అతడు బరిలోకి దిగుతాడు అన్న విషయాన్ని ఇప్పుడే స్పష్టం చెప్పలేమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
లీగ్ దశలో నవంబర్ 12న భారత జట్టు తన చివరి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు పాండ్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రిస్క్ తీసుకోకూడని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే మాత్రం నేరుగా సెమీ ఫైనల్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారాన్ని బట్టి మిగిలిన లీగ్ మ్యాచ్‌లు ఆడడం అనుమానమే. అయితే.. గాయం నుంచి కోలుకుని వచ్చిన పాండ్యను నేరుగా సెమీ ఫైనల్ ఆడించే సాహసాన్ని టీమ్‌మేనేజ్‌మెంట్ చేస్తుందా అన్నది ప్రశ్నగానే ఉంది. పాండ్య వచ్చే వరకు సూర్యకుమార్ యాదవ్‌ను అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది.