Paris : పారిస్ లో హింస.. ఈఫిల్ టవర్ వద్ద తగలబడుతున్న వాహనాలు..

Paris : పారిస్ లో హింస చేలరేగింది. ఈఫిల్ టవర్ వద్ద వాహనాలు తగలబడుతున్నాయి.

Champions League triumph in Paris Over 400 arrested over PSG fans celebrate

Paris : పారిస్‌లో హింస చెలరేగింది. ఈ క్రమంలో ఈఫిల్ టవర్ సమీపంలో పదుల సంఖ్యలో వాహనాలు తగలబడుతున్నాయి. ఇందుకు కారణం.. ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ విజయోత్సవాలు. ఈ సెలబ్రేషన్స్.. పారిస్‌లో హింసాత్మక ఘటనలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే.. ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా ఆర్సెనల్ జట్టుపై.. పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG) టీమ్ విజయం సాధించింది. దీంతో ఆ టీమ్ అభిమానులు నిర్వహించిన సంబరాలు కాస్త పారిస్ నగరంలో హింసాత్మకంగా మారాయి. విజయోత్సవాల పేరుతో కొందరు ఆకతాయిలు కార్లు, దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫ్రెంచ్ పోలీసులు 400 మందికి పైగా అరెస్ట్ చేశారు.

హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సెనల్‌ను పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ఓడించిన పీఎస్‌జీ.. తన టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో, ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పారిస్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. బిగ్ స్క్రీన్ మీద మ్యాచ్‌ని వీక్షించేందుకు గాను సుమారు 40 వేల మంది పార్క్ డెస్ ప్రిన్సెస్ (Parc des Princes) స్టేడియానికి చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ విజయం సాధించగానే అభిమానుల ఆనందం కట్టలు తెంచుకుంది.

*విజేత‌గా నిలిచే జ‌ట్టుకే కాదు ర‌న్న‌ర‌ప్‌కు ప్రైజ్‌మ‌నీ.. ఏ జ‌ట్టుకు ఎంత అంటే?

ఈ క్రమంలో మ్యాచ్‌లో విజయం సాధించడంతో.. సంబరాలు చేసుకోవడానికి సుమారు 20 వేల మంది ప్రజలు శనివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో షాంప్స్-ఎలిసీస్ వీధుల్లోకి వచ్చారు. గుంపులుగా చేరిన అభిమానులు పెద్ద మొత్తంలో బాణాసంచా కాల్చారు. కటౌట్లకు, తెరలకు నిప్పంటించారు. అంతటితో ఆగక అక్కడ కనిపించిన కార్లను, దుకాణాలను ధ్వంసం చేశారు. వీరిని చెదరగొట్టేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. టియర్ గ్యాస్ (బాష్పవాయువు) ప్రయోగించారు. దీంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి జరిగింది. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 400 మందికి పైగా ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*టీ20ల్లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ అరుదైన ఘ‌న‌త‌..

రాజధానిలో శాంతిభద్రతలను కాపాడటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం 22,000 మంది పోలీసులను మోహరించింది. గత ఏడాది ఇంటర్ మిలాన్‌ను ఓడించి పీఎస్‌జీ మొదటిసారి ఛాంపియన్స్ లీగ్ గెలిచినప్పుడు జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు.

చరిత్రలో రెండుసార్లు ఛాంపియన్స్ లీగ్ గెలిచిన మొదటి ఫ్రెంచ్ క్లబ్‌గా పారిస్ సెయింట్-జెర్మైన్ రికార్డు సృష్టించింది. అలాగే ఈ ఘనతను వరుసగా (back-to-back) సాధించిన రెండవ యూరోపియన్ క్లబ్‌గా నిలిచింది. ఈ తాజా టైటిల్‌తో పీఎస్‌జీ క్లబ్ ప్రారంభమైనప్పటి నుండి గెలిచిన మొత్తం ట్రోఫీల సంఖ్య 60కి చేరింది. ఇందులో 2011లో ఖతార్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చిన తర్వాత సాధించినవే 42 ట్రోఫీలు ఉండటం గమనార్హం.