Ajinkya Rahane : రహానే వ్యాఖ్యల పై మండిపడిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ముందే చెప్పాం కదా.. అయినా గానీ..
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) చేసిన ఆరోపణల పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది.
- Thota Vamshi Kumar
- Published On : March 30, 2026 / 12:42 PM IST
Cricket Australia Respond Ajinkya Rahane comments after MI vs KKR match in IPL 2026
- గ్రీన్ బౌలింగ్ చేస్తే బాగుండేదన్న రహానే
- స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా
Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను బౌలింగ్ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అడ్డుకుంటోందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే ఆరోపించాడు. ఇతడి ఆరోపణల పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది.
ఆదివారం ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినప్పటికి కూడా కోల్‌కతా దానిని కాపాడుకోలేకపోయింది. మ్యాచ్ అనంతరం దీనిపై రహానే మాట్లాడుతూ.. కామెరూన్ బౌలింగ్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. గ్రీన్ బౌలింగ్ చేస్తే జట్టుకు సమతూకం వచ్చి ఉండేది. అతడు ఇప్పుడు బౌలింగ్ చేయకపోవడంతో జట్టు సమతూకం కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత బౌలర్లకు పెద్దగా అనుభవం లేదని అన్నాడు. అతడు త్వరలోనే బౌలింగ్ చేస్తాడని ఆశిస్తున్నాను. అని రహానే అన్నాడు.
Mohammed Siraj : బిగ్‌బాస్ బ్యూటీతో హైదరాబాదీ పేసర్ డేటింగ్..! వీడియో వైరల్
ఇక గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయడం లేదు అనే ప్రశ్న రహానేకు ఎదురుకాగా.. ఆ విషయం తనకు తెలియదని, క్రికెట్ ఆస్ట్రేలియానే దాని గురించి అడగాలని అన్నాడు. ఎప్పుడూ కామ్‌గా కూల్‌గా ఉంటూ వివాదాలకు దూరంగా ఉండే రహానే చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రహానే వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. టీ20 ప్రపంచకప్ సమయంలో గ్రీన్‌కు వెన్ను గాయమైందని తెలిపింది. ప్రస్తుతం అతడు దాని నుంచి పూర్తిగా కోలుకోలేదని అంది. ఇంకా ఆ గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని వివరించింది. ఈ క్రమంలోనే అతడు కొంతకాలం పాటు బౌలింగ్‌కు దూరంగా ఉండాలని వెల్లడించింది.
ఐపీఎల్ లో తొలి 10 నుంచి 12 రోజుల పాటు గ్రీన్ బౌలింగ్ చేయడు అనే విషయమై ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తెలియజేసినట్లు చెప్పింది. వారికి మొత్తం తెలుసు అని అంది.
హర్షిత్ రాణా, మతీషా పతిరానా గాయాలో ఇప్పటికే కేకేఆర్ జట్టుకు దూరం అయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్రీన్ బౌలింగ్ వేయకపోవడం కేకేఆర్ కష్టాలను మరింత పెంచింది. ఆసీస్ బోర్డు చెప్పిన దాన్ని బట్టి ఇంకో మూడు మ్యాచ్‌ల్లోనూ గ్రీన్ బౌలింగ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఆ తరువాత కూడా అతడికి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇస్తేనే బౌలింగ్ చేస్తాడు. లేదంటే బ్యాటర్‌గానే కొనసాగే అవకాశం.
ఐపీఎల్ 2026 మెగావేలంలో కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 25.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్‌గా అతడి సేవలు వినియోగించుకోవాలని ఆశించగా.. ప్రస్తుతానికి కేకేఆర్‌కు నిరాశే ఎదురైంది.
