Cristiano Ronaldo : రొనాల్డో సంచలన వ్యాఖ్యలు.. నేను రాకముందు పోర్చుగల్ ఒక్క ట్రోఫీ గెలవలేదు..నేనే మూడు టైటిళ్లు అందించా..
ఫిఫా ప్రపంచకప్ 2026 నుంచి పోర్చుగల్ నిష్ర్కమించిన తరువాత ఆ జట్టు స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మీడియాతో మాట్లాడాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 7, 2026 / 10:37 AM IST
Cristiano Ronaldo stunning comments after Portugal team FIFA World Cup 2026 exit
Cristiano Ronaldo : ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ కథ ముగిసింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ మెగాటోర్నీ నుంచి పోర్చుగల్ నిష్ర్కమించింది. ఇక తనకు ఇదే చివరి ప్రపంచకప్ అని ఇప్పటికే పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. కంటతడి పెట్టాడు. అయితే.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు రిటైర్‌మెంట్ ప్రకటించే విషయంలో మాత్రం అతడు తొందర పడడం లేదు.
41 ఏళ్ల రొనాల్డో ప్రపంచ కప్ గెలవాలనే కల నెరవేరలేదు. అయినప్పటికి కూడా 2016 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ గెలవడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపాడు. స్పెయిన్‌తో మ్యాచ్ అనంతరం మీడియాతో రొనాల్డో మాట్లాడుతూ.. ఈ విధంగా ప్రపంచకప్ నుంచి వైదొలగడం నాకు ఎంతో బాధగా ఉంది. ప్రపంచకప్ గెలిచేందుకు నేను నా సర్వశక్తులు ఒడ్డి పోరాడాను. నా వంతు ఉత్తమంగా ఆడాను. ఇప్పుడు నిర్మలమైన మనసుతో నిష్ర్కమిస్తున్నాను. ఇది నా చివరి ప్రపంచకప్ అన్నది నిజమే. కానీ.. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం లేదు. ఈ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోను. ప్రస్తుతం నా కుటుంబంతో గడపడానికి సమయం ఉంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోను అని అన్నాడు.
IND vs ZIM : సంజూ శాంసన్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లేనా? జింబాబ్వే టూర్‌కు వైభవ్ సూర్యవంశీ
తన కెరీర్‌ను ఓ సారి గుర్తు చేసుకున్నాడు. 2016లో యూరోపియన్ ఛాంపియన్‌షిప్, 2019, 2025లో UEFA నేషన్స్ లీగ్‌లు – ఇలా మూడు టైటిళ్లను పోర్చుగల్ గెలవడంలో తాను సహాయపడ్డానని, అంతకు ముందు వారికి ఒక్క ట్రోఫీ కూడా లేదని రొనాల్డో చెప్పాడు.
నేను పోర్చుగల్ తరఫున మూడు టైటిళ్లను గెలిచాను. క్రిస్టియానో రొనాల్డో రాకముందు, పోర్చుగల్ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. జాతీయ జట్టు ఇప్పటివరకు గెలిచిన అతిపెద్ద టైటిల్ 2016లో గెలిచిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్. నిజం చెప్పాలంటే.. అది నాకు ప్రపంచ కప్‌తో సమానంగా ముఖ్యమైనది అని రొనాల్డో అన్నాడు.
ఒక ప్రధాన టోర్నమెంట్(ఫిఫా ప్రపంచకప్ 2026) నుండి నిష్క్రమించడం ఎల్లప్పుడూ బాధాకరమే. ఇది ప్రపంచ కప్. జట్టు నిజంగా పుంజుకుంటోంది. నా దృష్టిలో మేము బాగా ఆడాము. ఫలితం ఎలాగైనా ఉండవచ్చు, కానీ ఇదే ఫుట్‌బాల్. మనం తేరుకుని ముందుకు సాగాలి అని రొనాల్డో చెప్పుకొచ్చాడు.
