IND vs ZIM : సంజూ శాంసన్ అంతర్జాతీయ కెరీర్ ఇక ముగిసినట్లేనా? జింబాబ్వే టూర్‌కు వైభవ్ సూర్యవంశీ
జింబాబ్వే జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND vs ZIM) కోసం భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
BCCI announced India squad for the upcoming three match T20I series against Zimbabwe
IND vs ZIM : భారత టీ20 జట్టులో వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ స్థానం ప్రశ్నార్థకంగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చేందకు సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి టీమ్ మేనేజ్మెంట్ తప్పించింది.
ఇక ఇప్పుడు జూలై 23 నుంచి 26 వరకు జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులోనూ సంజూకు చోటు దక్కలేదు. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. పంజాబ్ వికెట్‌కీపర్, బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ సింగ్‌ను బ్యాకప్ వికెట్‌కీపర్‌గా ఎంపిక చేశారు. అలాగే పేసర్లు అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌లకు కూడా అవకాశం లభించింది.
సాధారణంగా భారత్ జింబాబ్వే పర్యటనను యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించే వేదికగా భావిస్తారు. కీలక సిరీస్‌లకు ముందు కొత్త ప్రతిభను పరీక్షించేందుకు ఈ టూర్‌ను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఈసారి సీనియర్ బ్యాటర్లలో సంజూ శాంసన్ మాత్రమే జట్టులో చోటు కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు మాత్రం జింబాబ్వే సిరీస్‌కు ఎంపికయ్యారు.
సంజూ కెరీర్ ముగిసినట్లేనా?
సంజూ శాంసన్ అంతర్జాతీయ టీ20 కెరీర్ ముగిసిందని ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఎందుకంటే సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో సంజూ శాంసన్‌కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో, అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ విఫలం కావడంతో సెలక్టర్లు కొత్త ఆటగాళ్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
బౌలింగ్ విభాగంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఆడిన అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్థానాల్లో యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్‌లను ఎంపిక చేశారు. రింకూ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
జింబాబ్వే పర్యటనకు భారత జట్టు..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జ్, రింకు సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, ఆశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)
అదే విధంగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శివమ్ దూబేకు సెలక్షన్ కమిటీ స్థానం కల్పించింది.
నవీకరించబడిన భారత వన్డే జట్టు..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, శివమ్ దూబె
