MI vs CSK
IPL 2023, MI vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు అన్ని రసవత్తరంగా సాగాయి. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు ఏమైనా ఉన్నాయా..? అంటే అవి ముంబై ఇండియన్స్(Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్లు మాత్రమే. మిగిలిన జట్లు అన్ని ఒకటో, రెండో మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఈ రెండు జట్లు మాత్రం ఇప్పటి వరకు గెలుపు బాట పట్టలేదు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్‌లు ఆడగా, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌లు ఆడింది. కనీసం ఒక్క మ్యాచులో కూడా ఈ జట్లు గెలవకపోవడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నేడు(మంగళవారం) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో తొలి విజయాన్ని నమోదు చేసేది ఎవరో అన్నది ఆసక్తికరంగా మారింది. బలా బలాలు పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ హోం గ్రౌండ్‌లో ఆడుతుండడం ఢిల్లీకి కాస్త అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు.
ముంబై బ్యాటింగ్ గాడినపడకుంటే కష్టమే
ఇప్పటి వరకు ముంబై జట్టు ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచుల్లో తిలక్ వర్మ మినహా మిగిలిన అందరూ దారుణంగా విఫలం అయ్యారు. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ముఖ్యంగా టీ20ల్లో విజృంభించే సూర్యకుమార్ ఫామ్ అందుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. రోహిత్, సూర్యలతో పాటు టిమ్ డేవిడ్ చెలరేగితే ముంబైను ఆపడం ఎవరి తరం కాదు. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. చెన్నైతో మ్యాచ్‌లో దారాళంగా పరుగులు ఇచ్చిన అర్షద్ ఖాన్‌పై వేటు పడొచ్చు. ముంబై స్పిన్ విభాగం చాలా బలహీనంగా ఉంది. పలు మార్పులు చేయొచ్చు.
వార్నర్ ఒక్కడే
బ్యాటింగ్‌లో ముంబై జట్టులోగానే ఢిల్లీ పరిస్థితి ఉంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతున్నాడు. ఓ ఎండ్‌లో వార్నర్ నిలబడుతున్నప్పటికి మరో ఎండ్‌లో వికెట్లు కోల్పోతుండడంతో గెలుపు ముంగిట బోర్లా పడుతోంది. ఆ జట్టు కీలక ఆటగాడు మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లడం కూడా ఓ కారణం కావచ్చు. మిడిల్ ఆర్డర్‌లో కీలక ఆటగాడు అయిన మిచెల్ మార్ష్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రైలీ రూసో, మనీష్ పాండేలు మిడిల్ ఆర్డర్‌లో చెలరేగాల్సిన అవసరం ఉంది. ఇక ఓపెనర్ పృథ్వీ షా అనవసర షాట్లకు ఔట్ కావడం జట్టును కలవరపెడుతోంది. అతడు మరింత బాధ్యతగా ఆడాలి. వార్నర్‌తో కలిసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందివ్వాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే బలంగానే ఉంది. సాధ్యమైనంత వరకు ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. రాజస్థాన్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే నేడు ఆడే అవకాశం ఉంది.