అందుబాటులో లేడు: నవంబరు వరకూ ధోనీ దూరం

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్‌కు రెండు నెలల పాటు విరామం తీసుకుని ఆర్మీ క్యాంపుకు ట్రైనింగ్‌కు వెళ్లాడు. క్యాంపు పూర్తి అయినా ఇంకా విధుల్లో చేరకపోవడంతో అభిమానుల్లో ప్రశ్న మొదలైంది. ఆడతాడా లేదా అనే సందేహాలతో పాటు రిటైర్మెంట్ ఇచ్చేస్తాడా అనే అనుమానాలు కూడా రెడీ అయిపోయాయి. ఇటీవల ఓ ఇంగ్లీష్ మీడియా వెల్లడించిన సమాచారం మేరకు ధోనీ నవంబరు వరకూ క్రికెట్ విరామాన్ని పొడిగించినట్లు తెలుస్తోంది. 

ఫలితంగా విజయ్ హజారే ట్రోఫీకి, సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు ధోనీ అందుబాటులో ఉండడు. ఇలా అయితే ఈ వెటరన్ వికెట్ కీపర్‌ మళ్లీ జట్టులో ఆడేది డిసెంబరులోనే. వెస్టిండీస్ పర్యటన నుంచి టీమిండియాకు గ్యాప్ ఇచ్చిన ధోనీ మళ్లీ వెస్టిండీస్ మ్యాచ్ లతోనే రీ ఎంట్రీ ఇస్తాడు. భారత గడ్డపై ఆడేందుకు వెస్టిండీస్ డిసెంబరులో భారత పర్యటన చేయనుంది. 

భారత పర్యటనలో ఉన్న సఫారీలు కోహ్లీసేనతో తలపడి గెలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు కోహ్లీ సరదాగా చేసిన ట్వీట్ ధోనీ రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని పుకార్లు పుట్టేలా చేసింది. దీనిపై కోహ్లీ వివరణ ఇచ్చుకుంటూ తనకు అలాంటి ఆలోచనే లేదని ధోనీ గురించి మామూలుగా చేసిన పోస్టు ఇలా రచ్చ లేపుతుందని అనుకోలేదని వివరించాడు. టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం ధోనీ రిటైర్మెంట్ ఇప్పుడే కాదంటూ చెప్పుకొచ్చాడు.