ICC U19 World Cup 2022: బోణి కొట్టిన యువ భారత్.. చెలరేగిన బౌలర్లు!

వెస్టిండీస్‌లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభమైన అండర్-19 ప్రపంచకప్‌లో భవిష్యత్ స్టార్‌లు పోటాపోటీగా ఆడుతున్నారు.

ICC U19 World Cup 2022: వెస్టిండీస్‌లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభమైన అండర్-19 ప్రపంచకప్‌లో భవిష్యత్ స్టార్‌లు పోటాపోటీగా ఆడుతున్నారు. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ మరోసారి టైటిల్‌ నెగ్గి అగ్రస్థానంలో నిలవాలని ఉరకలేస్తోంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి మధ్య తొలిసారిగా కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ 45పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

విక్కీ ఓస్వాల్ 5 వికెట్లు, రాజ్ బావా 4 వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 187 పరుగులకే ముగించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 46.5ఓవర్లలో 232పరుగులు చేయగా.. 50 ఓవర్లలో 233 పరుగుల విజయలక్ష్యంతో సౌతాఫ్రికా బరిలోకి దిగింది. భారత కెప్టెన్ యశ్ ధుల్ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

ఫస్ట్‌లోనే బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 11 పరుగులకే ఓపెనర్లు అంగ్క్రిష్ రఘువంశీ (05), హర్నూర్ సింగ్ (01) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ధూల్, ఎస్ రషీద్ (31) మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. ధూల్ తన 100 బంతుల ఇన్నింగ్స్‌లో 11బౌండరీలు సాధించి 82పరుగులు చేసి, రనౌట్ అయ్యాడు.

నిశాంత్ సింధు 25 బంతుల్లో 27 పరుగుల ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయీడు. తర్వాత, రాజ్ బావా (13) కూడా వెంటనే ఔటయ్యాడు. చివర్లో కౌశల్ తాంబే 35 పరుగులు చేశారు. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగో బంతికే ఈథాన్-జాన్ కన్నింగ్‌హమ్‌ను రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. దీని తర్వాత ఓస్వాల్, బావా వరుసగా వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టారు.

అయితే 36వ ఓవర్‌లో నాలుగో వికెట్‌ పడే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 138 పరుగుల వద్ద ఉండగా.. ఆ తర్వాత వికెట్ల పతనం మొదలైంది. జట్టు మొత్తం 45.4 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. 5 వికెట్లు తీసిన విక్కీ ఓస్వాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు