గంగూలీ పదవీ కాలం పొడిగింపు!

క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గంగూలీ తన మార్కు మార్పులు మొదలుపెట్టేశాడు. జాతీయ క్రికెట్ అకాడమీ అభివృద్ధితో పాటు తొలిసారి డే అండ్‌ నైట్‌ టెస్టులకు టీమిండియాను సిద్ధం చేస్తున్నాడు. వీటితో పాటుగా ఎంతో కీలకమైన కోట్లాది రూపాయిల ఖర్చుతో జరిగే ఐపీఎల్‌ వేడుకల్ని రద్దు చేశాడు. తాజాగా కశ్మీర్‌ క్రికెట్‌ అభివృద్ధికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరిన్ని మార్పులు చేసి భారత క్రికెట్ గతిని మార్చేందుకు గంగూలీ పదవీ కాలం సరిపోదని క్రికెట్ అసోసియేషన్ కమిటీ భావించింది. ఈ మేర తొమ్మిది నెలల పదవీ కాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని భావిస్తోంది. లోధా సంస్కరణలతో ఏర్పడిన బీసీసీఐ కొత్త రాజ్యాంగం గంగూలీని మూడేళ్లు కొనసాగేందుకు అనుమతించడం లేదు. తప్పని పరిస్థితుల్లో గంగూలీ కోసం బీసీసీఐ రాజ్యాంగానికి సవరణలు చేయాలని కొత్త పాలకవర్గం యోచిస్తున్నట్లు సమాచారం.

అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దాదా నెల రోజులు పూర్తికాకముందే సాహసోపేత నిర్ణయాలతో దూసుకెళ్తున్నాడు. జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని గంగూలీ ఆదేశించాడు. బీసీసీఐ నుంచి తమవంతుగా పూర్తి సహకారం అందిస్తామని సౌరవ్ గంగూలీ భరోసా ఇచ్చారు.