ENG vs IND Karun Nair may be dropped in 4th Test
‘ప్రియమైన క్రికెట్.. మరో అవకాశం ఇవ్వు..’ కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో కరుణ్ నాయర్ రాసుకున్న మాట ఇది. ఆ తరువాత ఎన్నో కష్టాలను ఓర్చి ఎనిమిదేళ్ల తరువాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు నాయర్. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. కెరీర్ తొలినాళ్లలోనే ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ తో సిరీస్ ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదాడు. దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో అదరగొడతాడని, రీఎంట్రీలో దుమ్ములేపుతాడని అంతా భావించారు.
అయితే.. రీ ఎంట్రీ టెస్టులోనే ఘోరంగా ఆడాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన అతడు డకౌట్ అయ్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 20 మాత్రమే పరుగులు చేశాడు. ఇక టీమ్ఇండియా ఆటగాళ్లు పరుగులు వరద పారించిన రెండో టెస్టులో అతడికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ వచ్చింది. మూడో స్థానంలో ఆడినప్పటికి పెద్దగా రాణించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 31, రెండో ఇన్నింగ్స్‌లో 26 పరుగులు మాత్రమే చేశాడు.
కనీసం మూడో టెస్టులోనైనా బాగా ఆడతాడని అనుకుంటే.. తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులతో కాస్త ఫర్వాలేదనిపించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులతో విపలం అయ్యాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ నాయర్ 131 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో అతడికి నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఛాన్స్ ఉంటుందా లేదా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌కు అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అతడి బదులుగా సాయి సుదర్శన్‌ను లేదా ఎన్నాళ్లుగానో అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్న అభిమన్యు ఈశ్వరన్‌ను అయినా ఆడించాలని పలువురు మాజీలు టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచిస్తున్నారు.
ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. 61 ఏళ్ల రికార్డు పై రిషబ్ పంత్ కన్ను..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తేడాతో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో నాలుగో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈక్రమంలో అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈక్రమంలో విఫలమైన, ఫామ్‌లో లేని ఆటగాళ్ల పై వేటు పడనుంది.